బుధవారం, 05 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅమరావతిలో మళ్లీ భూ సమీకరణ

1 గంట క్రితం

AMARAVATHI
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 12:27 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మోతడకలో మూడవ విడత

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

రాజధాని అమరావతి భూ సమీకరణ పథకాన్ని విస్తరిస్తున్నారు. రెండోవిడతలో 20,494 ఎకరాలు తీసుకుంటున్న ప్రభుత్వం తాజాగా మూడోవిడత కూడా చేపట్టనుంది. దీనిలో భాగంగా తొలిదశలో మోతడక గ్రామంలో సమీకరణ కోసం 2,340 ఎకరాలు తీసుకోవాలని నిర్ణయించింది. రైల్వే ప్రాజెక్టు కోసం దీన్ని తీసుకుంటున్నామని, గ్రామస్తుల కోరిక మేరకే ఈ ప్రక్రియ చేపట్టామని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవంగా గతంలోనే ఈ ప్రాంతంలో సమీకరణకు వీలుగా గ్రామసభలను పూర్తి చేయడం గమనార్హం. తాడికొండ మండలంలోని మోతడకలో మొత్తం 2, 376 ఎకరాల భూమి ఉండగా మొత్తం సమీకరణ పథకం కింద తీసుకోవాలని నిర్ణయించారు. గ్రామంలో మొత్తం 972 నివాసాలు ఉండగా 3,200 మంది నివాసం ఉంటున్నారు. తాడికొండ మండలం మొత్తంలో 48,500 ఎకరాల భూమి ఉంది. గతంలో ఈ మండలం పరిధిలోని గ్రామాల్లో భూ సమీకరణకు వీలుగా గ్రామసభలు నిర్వహించారు. 12 రెవెన్యూ గ్రామాల్లో సభలు పూర్తి చేశారు. వాటిల్లో తాడికొండ పరిధిలోని పాములపాడు, బండారుపల్లె, పొన్నెకల్లు, రావెల, లామ్‌, బేజాత్‌‌పురం,దామరపల్లె గ్రామాలు కూడా ఉన్నాయి. గతంలో ఉన్న అనుభవాల దృష్ట్య ఈసారి మొత్తం గ్రామాలు ఒకేసారి కాకుండా గ్రామసభలు నిర్వహించి, వారి కోరిన తరువాతే భూ సమీకరణ పథకానికి వెళ్లాలని నిర్ణయించి దానిలో భాగంగా భూ సమీకరణ పథకాన్ని అమలు చేస్తున్నారు. ముఖ్యంగా రైల్వేలైను ఏర్పాటు కోసం భూ సమీకరణ చేస్తున్నామని చెబుతున్నా వాస్తవంగా అంతకుముందే ఈ గ్రామాలను రాజధానిలో కలపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మోతడకలో 2340 ఎకరాలు తీసుకుంటున్నారు.

గ్రామసభల్లో పూలింగు కోసం తీర్మానం

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తుళ్లూరు మండలంలో మిగిలిన గ్రామాలతోపాటు అమరావతి, తాడికొండ, పెదకూరపాడు మండలాల పరిధిలోని పలు చోట్ల గ్రామసభలు నిర్వహించారు. దీనిలో తాడికొండలో 5179 హెక్టార్లు, బందరుపల్లిలో 1930, పాములపాడులో 1694, పొన్నెకల్లులో 1546, కంతేరులో 1486, రావెలలో 1460, బేజాత్‌‌పురంలో 1342, లామ్‌‌లో 1208, దామరపల్లెలో 1168 హెక్టార్ల భూమిని సమీకరణ కింద ఇచ్చేలా ఎమ్మెల్యే తదితరులు గ్రామసభల్లో తీర్మానం చేయించారు. అయితే నిడుముక్కల గ్రామంలో 815 హెక్టార్లు తీసుకోవాలని తీర్మానం చేసినా రెండో విడత జరిగిన గ్రామసభలో అక్కడి ప్రజలు వ్యతిరేకించారు. తాము పూలింగుకు ఇవ్వబోమని అభ్యంతరం తెలిపారు.

రెండోదశ మాస్టర్‌ ‌ప్లానుకు సిద్ధం

రెండోదశలో సమీకరించిన భూమికి మాస్టర్‌ ‌ప్లాను తయారు చేసే బాధ్యతను సింగపూర్‌‌కు చెందిన సుర్భానాకు అప్పగించారు. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం సిఆర్డిఏ సుర్బానాకు అందిస్తోంది. త్వరలోనే ప్లాను పూర్తి చేసే అవకాశం ఉందని తెలిసింది. ప్రాథమిక అంచనాలు పూర్తయినా సమగ్ర ప్లాను తీసుకొచ్చేదిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్