సిపిఎం నేతలపై అక్రమ కేసులు, రౌడీషీట్లు ఎత్తివేయాలి
వామపక్షాల రౌండ్‌టేబుల్ సమావేశం డిమాండ్
7న కలెక్టరేట్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయం
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్ : ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పోలీసు నిర్బంధాన్ని ఆపాలని, సిపిఎం నాయకులపై పెట్టిన అక్రమ రౌడీషీట్లు, కేసులను ఎత్తివేయాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఏలూరు పవర్‌పేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో బుధవారం సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్ లింగరాజు అధ్యక్షతన వామపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ లింగరాజు, ఎంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి కాటం నాగభూషణం, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సాలి రాజశేఖర్, ఎంసిపిఐ (యు) జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్ డాంగే మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల తరఫున 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, గిరిజనుల భూములు గిరిజనులకు అప్పగించాలని సంవత్సరాలుగా సిపిఎం అనేక పోరాటాలు చేసిందన్నారు. ఈ పోరాటాల ఫలితంగా కొన్ని వేల ఎకరాలు గిరిజనులు సాధించుకున్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సిపిఎం నాయకులపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని, ఇటీవల ఈ నిర్బంధం మరింత పెరిగి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అందుగుల ఫ్రాన్సిస్ పై రౌడీషీట్లు ఓపెన్ చేసి వేధిస్తున్నారని తెలిపారు. మూడు నెలల క్రితం సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ, జీలుగుమిల్లి మండల నాయకులు తెల్లం దుర్గారావుపై రౌడీషీట్లు ఓపెన్ చేసి, 307 కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. పోరాటాలు చేసే వారిని ఈ ప్రభుత్వం నేరస్తులుగా చూడడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, రౌడీషీట్లు ఓపెన్ చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజల కోసం, గిరిజనుల కోసం చేసే ఉద్యమాలను ఆగబోవని స్పష్టం చేశారు. సిపిఎం నాయకులపై పెట్టిన రౌడీషీట్లను ఎత్తివేయాలని, అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. లేనిపక్షంలో జిల్లాలోని వామపక్ష పార్టీలను, ప్రజాసంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మొడియం నాగమణి మాట్లాడుతూ ఏజెన్సీలో పోలీసులు సిపిఎం నాయకుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని వివరించారు. సెప్టెంబర్ ఏడో తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె శ్రీనివాస్, ఐఎఫ్‌టియు జిల్లా ఉపాధ్యక్షులు కె.సూర్యప్రసాద్, సిపిఎం నగర కమిటీ సభ్యులు ఎం ఇస్సాక్, సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, చేతివృత్తిదార్ల సంఘం జిల్లా కన్వీనర్ పిచ్చుక ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)