- సిపిఎం, సిపిఐ నేతల అడ్డగింత
ప్రజాశక్తి - నాతవరం (అనకాపల్లి జిల్లా) : లేటరైట్ తవ్వకాలపై బుధవారం అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సుందరకోట పంచాయతీ సిరిపురం గ్రామంలో తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణ పోలీసుల నిర్బంధం మధ్య సాగింది. సిపిఎం, సిపిఐ నాయకులను అడ్డుకున్నారు. మైనింగ్ మాఫియా అనుకూలురుతో అభిప్రాయాలు చెప్పించి కార్యక్రమం ముగించారన్న విమర్శలు వినిపించాయి. లేటరైట్ తవ్వకాలపై ప్రజాభిప్రాయ సేకరణను ఆర్‌డిఒ వివి.రమణ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టారు. పర్యావరణ అధికారి ముకుందరావు తదితరులు పాల్గొన్నారు. సుమారు 200 మంది ప్రజలు పాల్గొనగా 15 మంది మాట్లాడారు. సీనియర్ ఎన్‌జిఒ రమేష్ నాయుడు మాట్లాడుతూ.. ప్రజలకు నష్టం చేకూర్చే ఈ తవ్వకాలకు పూర్తి వ్యతిరేకమన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజు మాట్లాడుతూ.. సుందరకోట పంచాయతీ బమిడికలొద్ది గ్రామంలో సర్వే చేయని కొండ ప్రాంతంలో లేటరైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం వల్ల గిరిజనుల జీవనాధారం, వ్యవసాయం, భూగర్భ జలాలు, పర్యావరణం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. ఈ ప్రాంతంలో అనుమతులకు మించి అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. దీనివల్ల నాగులకొండ, అల్లూరి గుహలు, సరుగుడు వాటర్‌ఫాల్స్‌తో పాటు వాగులు, గెడ్డలు, అటవీ సంపదకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొండల తవ్వకాల వల్ల తాగునీరు, సాగునీటి సమస్యలు ఏర్పడి తాండవ, వరహా నదులపై కూడా ప్రభావం పడే ప్రమాదముందన్నారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ తరాల దృష్టితో మైనింగ్‌కు పూర్తి వ్యతిరేకమని తెలిపారు. తమ పార్టీ జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావును వెదురుపల్లి సెంటర్ వద్ద పోలీసులు అడ్డగించడం సరికాదన్నారు. సిపిఐ జిల్లా నాయకులు బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ.. తవ్వకాలకు తాము పూర్తి వ్యతిరేకమని తెలిపారు.
పలువురు అడ్డగింత
ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం వద్దకు వస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావును వెదురుపల్లి సెంటర్ వద్ద పోలీసులు అడ్డగించారు. జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజును అడ్డుకుని కొద్దిసేపటి తరువాత అతనికి అనుమతి ఇచ్చారు. పోలీస్ నిర్బంధాన్ని సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ ఓ ప్రకటనలో ఖండించింది.







కామెంట్‌లు (0)