ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సియు) విద్యార్థి సంఘం ఎన్నికలు 2026–27లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోని వామపక్ష, సామాజిక శక్తుల కూటమి ఘన విజయం సాధించింది. ఎస్ఎఫ్ఐ-ఎస్ఎఎ-ఎఐఎస్ఎ- డిఎస్‌యు-టిఎస్ఎఫ్ కూటమి అభ్యర్థులు పలు కీలక పదవుల్లో విజయం సాధించారు. ప్రధానంగా ఎబివిపి-ఎస్ఎఫ్ఐ కూటముల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోని కూటమి అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు.
అధ్యక్ష పదవికి ఎస్ఎఫ్ఐ తరఫున పోటీ చేసిన దిల్షాదా 451 ఓట్ల మెజారిటీతో ఎబివిపి అభ్యర్థి పి. నరేష్‌పై విజయం సాధించారు. దిల్షాదాకు 2,178 ఓట్లు, నరేష్‌కు 1,727 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్ష పదవికి ఎస్ఎఫ్ఐ కూటమి అభ్యర్థి కొర్రా నితిన్ చాహాన్ 287 ఓట్ల మెజారిటీతో ఎబివిపి అభ్యర్థి బర్షరాణి బెహరాపై విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసిన ప్రతీక్ 311 ఓట్ల మెజారిటీతో ఎబివిపి కూటమి అభ్యర్థి వినీష్ చౌదరిపై గెలుపొందారు. సహాయ కార్యదర్శి పదవికి ఎస్ఎఫ్ఐ కూటమి నుంచి పోటీ చేసిన సిద్ధాంత్ 399 ఓట్ల మెజారిటీతో ఎబివిపి అభ్యర్థి సప్తగిరిపై విజయం సాధించారు. కల్చరల్ సెక్రటరీ పదవికి ఎస్ఎఫ్ఐ కూటమి అభ్యర్థి అభినాష్ కుమార్ ఐదు ఓట్ల స్వల్ప మెజారిటీతో ఎబివిపి అభ్యర్థి మధురపై విజయం సాధించారు. ఐసిసి జిఎస్సిఎఎస్హెచ్ (పిజి) పదవికి ఎస్ఎఫ్ఐ అభ్యర్థి నఫీ 677 ఓట్ల మెజారిటీతో ఎబివిపి అభ్యర్థి చైతన్య సాయిపై విజయం సాధించారు. ఐసిసి జిఎస్సిఎఎస్హెచ్ (పిహెచ్డి) పదవికి ఎస్ఎఫ్ఐ కూటమి అభ్యర్థి బి. లావణ్య 180 ఓట్ల మెజారిటీతో ఎబివిపి అభ్యర్థి సోనీ బర్లపై విజయం సాధించారు.
ప్రధాన ప్యానల్‌తో పాటు 13 స్కూళ్ల పరిధిలోని 59 స్కూల్ కౌన్సిలర్, స్కూల్ బోర్డు మెంబర్ స్థానాల్లో 32 స్థానాలను ఎస్ఎఫ్ఐ కూటమి సాధించిందని తెలిపారు.
గత ఏడాది కాలంలో ఎబివిపి విద్యార్థి సంఘం అధికారంలో ఉన్న సమయంలో క్యాంపస్‌లో ప్రజాస్వామ్య వాతావరణం దెబ్బతిన్నదని, విద్యార్థుల సమస్యలను ప్రశ్నించిన వారిపై దాడులు జరిగాయని, కనీస మౌలిక సదుపాయాల కల్పన కోసం తగిన స్థాయిలో పని జరగలేదని విద్యార్థులు తమ ఎన్నికల తీర్పు ద్వారా స్పష్టం చేశారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పేర్కొంది. విద్యార్థులు, అధ్యాపకుల సమస్యలపై నిరంతరం పోరాడాల్సిన అవసరం ఉందని ఈ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయని తెలిపింది. ఈ ఎన్నికల ఫలితాల ద్వారా విద్యార్థుల సమస్యలు, హక్కులు, క్యాంపస్ ప్రజాస్వామ్యం వంటి అంశాలపై పోరాడుతున్న విద్యార్థుల పక్షాన నిలబడటానికి విద్యార్థి లోకం తమ మద్దతును తెలియజేసిందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పేర్కొంది.
ఈ విజయాన్ని అందించిన HCU విద్యార్థి లోకానికి SFI రాష్ట్ర కమిటీ జేజేలు పలికింది. విద్యార్థులు తమపై ఉంచిన బాధ్యతను గుర్తించి క్యాంపస్‌లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం, మెరుగైన మౌలిక సదుపాయాల కోసం కృషి చేయడం వంటి అంశాలపై SFI కూటమి పనిచేస్తుందని తెలిపింది.
ఎన్నికల్లో విజయం సాధించిన SFI కూటమి అభ్యర్థులకు SFI తెలంగాణ రాష్ట్ర కమిటీ అభినందనలు తెలిపింది.








కామెంట్లు (0)