రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులకు లీగల్ సెల్ రక్షణ కవచంలా, అవసరమైనప్పుడు న్యాయపరమైన ఆయుధంలా నిలవాలని వైసిపి స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ లీగల్ సెల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశంలో వైసిపి ప్రధాన కార్యదర్శులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పూడి శ్రీహరి, లీగల్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ మలసాని మనోహర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో చనిపోయినవారి, డూప్లికేట్, అనర్హ ఓట్లు తొలగిస్తున్న పరిస్థితుల్లో, కొత్త ఓటర్ల జాబితా అందుబాటులోకి రాకముందే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం తొందరపడుతోందని అన్నారు. బిసి రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ నివేదికను ప్రజలకు అందుబాటులో పెట్టకుండా శాతం నిర్ణయించడం ఏ ప్రాతిపదికన జరిగిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. గత రెండున్నరేళ్లుగా పార్టీ కార్యకర్తలు ఎదుర్కొన్న కేసులు, అరెస్టులు, వేధింపుల సమయంలో లీగల్ సెల్ వారికి భరోసాగా నిలిచిందన్నారు.








కామెంట్‌లు (0)