సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionభగత్ సింగ్ స్ఫూర్తితో ‘ఓటు హక్కును కాపాడుకుందాం’

58 నిమిషాల క్రితం

భగత్ సింగ్ స్ఫూర్తితో
‘ఓటు హక్కును కాపాడుకుందాం’
-జయంతి సభలో విద్యార్థి, యువజన సంఘాల ప్రతిజ్ఞ
-సిఇసి జ్ఞానేశ్‌ ‌కుమార్‌‌ను తొలగించి శిక్షించాలని డిమాండ్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 12:10 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • జయంతి సభలో విద్యార్థి, యువజన సంఘాల ప్రతిజ్ఞ

  • సిఇసి జ్ఞానేశ్‌ ‌కుమార్‌‌ను తొలగించి శిక్షించాలని డిమాండ్‌

ప్రజాశక్తి- యంత్రాంగం : భగత్ సింగ్ స్ఫూర్తితో విద్య, ఉపాధి కోసం యువత పోరాడాలని, ఆయన ఆశయాల సాధనకు ఉద్యమించాలని, సమసమాజం కోసం పాటుపడాలని యువజన, విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా భగత్ సింగ్ 119వ జయంతి సోమవారం ఘనంగా జరిగింది. యూత్‌ ‌ఫర్‌ ‌డెమోక్రసీ పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు. ‘భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ఓటు హక్కును కాపాడుకుందాం’ అంటూ ప్రతిజ్ఞ చేశారు. విజయవాడ లెనిన్ సెంటరులో జరిగిన కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.రవి, ఎఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి యుగంధర్, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి మాట్లాడుతూ దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 18 ఏళ్లకే ఓటు హక్కును నేడు చీఫ్ ఎలక్షన్‌ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ పరోక్షంగా తిరస్కరించి కేంద్ర ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న నిరుద్యోగంపై యువత పోరాడుతోందని, దీన్ని సహించలేక వారి ఓటు హక్కును హరిస్తున్నారని వివరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు గుండెలాంటిదన్నారు. దాన్ని నేడు పాలకులు ఎస్ఐఆర్ (సర్‌) పేరుతో తీసివేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దేశంలో బిజెపి అన్ని వ్యవస్థలనూ నాశనం చేసిందని విమర్శించారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు బిజెపి, ఆర్ఎస్ఎస్ చేస్తోన్న కుట్రలు ఇక సాగవని హెచ్చరించారు. జ్ఞానేశ్ కుమార్‌ భారత రాజ్యాంగాన్ని ధిక్కరించి, ప్రజాస్వామ్య విలువలకు పాతర వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను పదవి నుంచి తొలగించి చట్టప్రకారం కఠినంగా శిక్షించే వరకూ పోరాడతామన్నారు.

అనకాపల్లి ఆర్‌‌టిసి కాంప్లెక్స్ వద్ద సేవ్ డెమోక్రసీ - సేవ్ ఇండియా పేరిట డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, దేశానికి మూల స్థంభాలైన అన్ని వ్యవస్థలనూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకొని నిర్బంధాన్ని ప్రయోగిస్తోంద ని, ఎన్నికల కమిషన్‌‌ను బిజెపి తన

జేబు సంస్థగా ఉపయోగించుకుంటోందని వివరించారు. కార్యక్రమంలో నాయకులు చలపతి, ఆర్.అవినాష్, వివి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. విశాఖలోని 54వ వార్డు రైతు బజార్‌ ‌వద్ద డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన భగత్‌ ‌సింగ్‌‌ చిత్రపటం వద్ద నివాళ్లర్పించారు. సంఘం జిల్లా నాయకులు యుఎస్‌ఎన్‌.రాజు పాల్గొన్నారు. తిరుపతి దివ్యారామంలో వాకర్స్ ఆధ్వర్యంలో షటిల్ కోర్టు వద్ద ప్రతిజ్ఞ చేశారు. డివైఎఫ్ఐ జిల్లా నాయకులు నరేంద్ర, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు పాల్గొన్నారు. ఎస్వీ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ‘మా ఓటు.. మా హక్కు.. సర్ పేరుతో మా ఓటును తొలగించొద్దు` అంటూ నినాదాలు చేశారు. జిల్లా ఆధ్యక్ష, కార్యదర్శులు పవిత్ర, అక్బర్ పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి నిర్వహించారు. సిపిఎం నేతలు అంగేరి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీనివాస కోచింగ్ సెంటర్ కానిస్టేబుల్ అకాడమీలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మాజీ జిల్లా కార్యదర్శి ఎస్.జయచంద్ర, జిల్లా కార్యదర్శి వీరేష్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. విప్లవ వీరుడు భగత్ సింగ్, మహాకవి గుర్రం జాషువా జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కారానికి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద ఒక రోజు మహాదీక్ష నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కో కన్వీనర్ అమూల్య, వెంకట్, అయ్యప్ప, మణికంఠ, ఆంజనేయ, ఉదయ్, అభిలాష్, శ్రీనివాస్ దీక్ష చేపట్టారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్, ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. వైఎస్‌ఆర్‌ ‌కడప, అన్నమయ్య జిల్లాల్లో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భగత్‌ ‌సింగ్‌‌కు ఘనంగా నివాళులర్పించారు.​

విజయనగరంలో ఉత్సాహంగా భగత్ సింగ్ యూత్ ఫెస్ట్

‘డ్రగ్స్ అంతం... విజయనగరం యువత పంతం’ అనే నినాదంతో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో విజయనగరంలోని తోటపాలెంలో యూత్ ఫెస్ట్ ఉత్సాహంగా సోమవారం ప్రారంభమైంది. భగత్ సింగ్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ సబ్ ఇన్ స్పెక్టర్ ప్రసన్నకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా భగత్ సింగ్, గాంధీజీ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.రాము అధ్యక్షతన జరిగిన సభలో ప్రసన్నకుమార్ మాట్లాడారు. డ్రగ్స్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు తమ్మినేని సూర్యనారాయణ, రెడ్డి శంకరరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి వి రమణ, ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ, జెవివి నాయకులు వి.రాజ్ గోపాల్, డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ హరీష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చినబాబు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్