సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపన్ను కాదు.. రుసుము కాదు.. మరి ఇదేంటి ?

1 గంట క్రితం

ఇది పన్ను కాదు, రుసుము కాదు, మరి ఇదేంటి ?
రూ.2వేల పైబడిన యుపిఐ లావాదేవీలపై ఫీజు వసూలుపై స్టేకు సుప్రీం తిరస్కృతి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 12:04 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • రూ.2వేలు పైబడిన యుపిఐ లావాదేవీలపై సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: రూ.2 వేలకు పైబడిన యుపిఐ లావాదేవీలపై ఫీజు వసూలు చేయాలన్న కేంద్రం నిర్ణయంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. ‘‘ఇది పన్ను కాదు, రుసుము కాదు.. మరి ఇదేంటి?’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఏ చట్టబద్ధమైన ప్రాతిపదికన ఈ ఛార్జీలు విధిస్తున్నారు, వీటి ద్వారా ఎవరికి లాభం చేకూరుతుంది, ఈ మొత్తం ఎవరెవరికి ఎలా పంపిణీ అవుతుంది అని ప్రశ్నిస్తూ కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ)లకు వివరణ కోరింది. అయితే, ఈ ఛార్జీలపై తాత్కాలికంగా స్టే విధించేం దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సంబంధిత సంస్థలన్నీ తమ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేసిన తర్వాతే ఈ అంశాన్ని పరిశీలిస్తామని, ప్రస్తుతం ఛార్జీల చట్టబద్ధతపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేసింది.

చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం, కొత్త యుపిఐ ఫీజు ఫ్రేమ్‌వర్క్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపింది. ఈ నెల 15న కేంద్రం ప్రకటించిన ఎండిఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) ఫ్రేమ్‌వర్క్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ న్యాయవాది అంజన్ దత్తా ఈ పిటిషన్ దాఖలు చేశారు. చట్టబద్ధమైన రక్షణ, పారదర్శకత పాటించకుండా, నిపుణులతో సంప్రదింపులు జరపకుండానే ఈ రుసుమును ప్రవేశపెట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. రూ.2,000కు పైబడిన యుపిఐ లావాదేవీలపై ఫీజు ఫ్రేమ్‌వర్క్‌ను వెంటనే రద్దు చేయాలని లేదా నిలిపివేయాలని కోరారు. పారదర్శకంగా చర్చలు జరిపి, సరైన గణాంకాలు, ప్రభావ అంచనాలు వెల్లడించి, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు రక్షణ కల్పిస్తూ కొత్తగా సమీక్ష చేపట్టాలని కూడా పిటిషన్‌లో దత్తా కోరారు.

ఈ సందర్భంగా కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. యుపిఐ చెల్లింపులపై 0.4 శాతం చొప్పున ఎండిఆర్‌ను విధిస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం విచారణ సందర్భంగా, ఈ ఎండిఆర్ స్వభావం ఏమిటని జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి ప్రశ్నించారు. ‘‘ఇది పన్ను కాదు, రుసుము కాదు.. అటువంటప్పుడు ఈ చెల్లింపు స్వభావం ఏమిటి?’’ అని అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్.వెంకటరామన్‌ను ఆయన నిలదీశారు.

చెల్లింపులు, సెటిల్‌మెంట్ వ్యవస్థల చట్టం-2007లోని సవరించిన సెక్షన్ 10ఎ రాజ్యాంగబద్ధతను ఈ పిటిషన్ సవాలు చేసింది. ఏ ఎలక్ట్రానిక్ చెల్లింపులపై ఛార్జీలు లేకుండా రక్షణ కల్పించాలో నిర్ణయించే అనియంత్రిత అధికారాలను ఈ సెక్షన్ ప్రభుత్వానికి ఇస్తోందని పిటిషన్ విమర్శించింది. ఎలాంటి ఆర్థిక పరిమితి లేకుండా రూపే డెబిట్ కార్డులకు ఎలాంటి ఛార్జీలు విధించని రక్షణ కొనసాగుతోందని, అదే రక్షణ యుపిఐ లావాదేవీలకు ఎందుకు వర్తించదని పిటిషనర్ ప్రశ్నించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్