గంగవరం మండలంలో దయనీయ స్థితిలో గిరిజన విద్యార్థులు
ప్రభుత్వం వెంటనే పాఠశాల భవనాలు నిర్మించాలి : ఎస్‌ఎఫ్‌ఐ
ప్రజాశక్తి- గంగవరం (పోలవరం జిల్లా) : పోలవరం జిల్లాలో ‘స్కూల్ బచావో’ క్యాంపెయిన్‌లో భాగంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర బృందం చేపట్టిన పర్యటనలో గిరిజన ప్రాంత పాఠశాలల్లోని సమస్యలు వెలుగు చూస్తున్నాయి. గంగవరం మండలంలో సోమవారం పలు ప్రాథమిక పాఠశాలలు, ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో పర్యటించగా ఆయాచోట్ల కనీస వసతులు లేని స్థితి కానవచ్చింది. దొరమామిడి గ్రామంలోని పాఠశాల శిథిలావస్థలో ఉండటంతో 33 మంది గిరిజన విద్యార్థులు డ్వాక్రా సమావేశాల కోసం నిర్మించిన గుడిసెలో పాఠాలు నేర్చుకోవడం కనిపించింది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తీవ్రమైన సమస్యలను చూశామన్నారు. కనీసం భవనాలు లేని పాఠశాలలు కూడా ఉన్నాయని, కొన్ని చోట్ల భవనాలు ఉన్నా శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. కనీస సదుపాయాలు లేకుండా విద్యార్థుల చదువులు ఎలా సాగుతాయని ప్రశ్నించారు. గంగవరం మండలం దొరమామిడి గ్రామంలో 33 మంది విద్యార్థులు పాఠశాల శిథిలావస్థలో ఉండటంతో డ్వాక్రా సమావేశాల కోసం నిర్మించిన గుడిసెలో పాఠాలు నేర్చుకుంటున్నారని తెలిపారు. రాజుపేట గ్రామంలో 25 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, నాడు - నేడు కింద పనులు ప్రారంభించి ప్రారంభ దశలోనే నిలిపివేయడంతో గ్రామస్తులు నిర్మించిన గుడిసెలోనే పాఠశాల నడుస్తోందని వివరించారు. కనీస వసతులతో కూడిన పాఠశాల భవనం కూడా లేకపోవడం గిరిజన విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కేవలం పాఠశాలలు ఉన్నాయని లెక్కల్లో చూపించడం కాకుండా ప్రతి పాఠశాలకు పక్కా భవనం, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. దొరమామిడి, రాజుపేట పాఠశాలలకు వెంటనే నూతన భవనాలు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని, అప్పటివరకు విద్యార్థులకు సురక్షితమైన తాత్కాలిక వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సహాయ కార్యదర్శి ప్రసాద్, నాయకులు లోవ రాజు, భాస్కర్, గిరిజన సంఘం నాయకులు శాంతిరాజ్, సిరిమల్లి రెడ్డి పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)