- వైసిపి నేతలకు మంత్రి సవిత సూచన
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిపై ఎలాంటి అనుమానాలు ఉన్నా.. ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీకి వచ్చి చర్చించాలని బిసి సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. అవసరమైతే ఒక రోజంతా మెగా డీఎస్సీపై అసెంబ్లీ వేదికగా చర్చించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి స్పష్టం చేశారు. నీతి, నిజాయితీ ఉంటే సభకు వచ్చి తేల్చుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 14 డీఎస్సీలు నిర్వహించారని, వాటి ద్వారా రెండు లక్షలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశారని గుర్తు చేశారు. ఏ డిఎస్సిలోనూ అక్రమాలకు తావులేకుండా, టీచర్ పోస్టులు భర్తీ చేశారన్నారని తెలిపారు. 2025 మెగా డిఎస్సిపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. నోటిఫికేషన్ రాగానే కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకోవాలని వైసిపి నేతలు చూశారన్నారన్నారు. మంత్రి లోకేశ్ ఆ అడ్డంకులన్నింటినీ అధిగమించి, మెగా డిఎస్సిని అవినీతికి, అక్రమాలకు తావులేకుండా నిర్వహించారన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపుతుంటే, వారందరినీ గొడ్డలి పార్టీ అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉన్నా, పోయినా ఉపాధ్యాయులను అవమానించడమే పనిగా పెట్టుకోవడం మానుకోవాలని కోరారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం రేయింబవళ్లు కష్టపడిన వారిని తక్కువ చేసి మాట్లాడడం సరికాదని హితవు పలికారు. వైసిపి నేతలు, జగన్ తప్పుడు ఆరోపణలపై రాయలసీమకు చెందిన ఉపాధ్యాయులంతా సమరశంఖం పూరించారన్నారు.








కామెంట్‌లు (0)