కేబినెట్ నిర్ణయం
తాగునీటి కష్టాలు తప్పవని చెప్పిన సిఎం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు రాష్ట్రానికి ఉదారంగా నిధులు, ఇతర సహాయ సహకారాలు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
అజెండాలో ఉన్న 30 అంశాలపై చర్చించిన అనంతరం ఎల్‌నినోపై సిఎం ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తాగునీటి కష్టాలు తప్పేలా లేవని ముఖ్యమంత్రి మంత్రుల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20వేల నివాస ప్రాంతాలు ఉంటే వాటిల్లో 14,829 నివాస ప్రాంతాల్లో తాగునీటి సమస్య వచ్చే ప్రమాదం ఉందని ఇప్పటికే గుర్తించినట్లు సిఎం చెప్పారు. ‘నివాస ప్రాంతాల వారీగా తాగునీటిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. ప్రజలందరికీ తాగునీరు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి. అవకాశం ఉన్న ప్రాంతాల్లో బోర్లు వేయడం, ట్యాంకర్లు ద్వారా తాగునీటిని సరఫరా చేయడం వంటి తక్షణ చర్యలు తీసుకోవాలి’ అని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగానే రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాయాలని, సాయం కోసం కోరాలని నిర్ణయించినట్లు కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించిన సమాచార, పౌరసంబంధాల శాఖమంత్రి కొలుసు పార్ధసారధి చెప్పారు. ‘ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయింది. సాధారణ వర్షపాతం నమోదైన సందర్భాల్లో 90శాతం సాగులోకి వచ్చే భూమి ఈ ఏడాది 60-65 శాతం మాత్రమే సాగులోకి వచ్చింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎల్ నినో ప్రభావాలను రైతులకు వివరించాలి. పంట మార్పిడిపై తగు సూచనలు, సలహాలు అందించి ఆరుతడి పంటల వైపు మొగ్గుచూపేలా తగు చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వం 90వేల కిలోల ఆరుతడి పంటల విత్తనాలను పంపిణీ కోసం సిద్ధం చేయాలి. పశుగ్రాస కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని సిఎం ఆదేశించినట్లు మంత్రి చెప్పారు.
పోలీసులకు కొత్త వాహానాలు
4760 పోలీస్ వాహనాలను కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకునట్లు మంత్రి పార్ధసారధి చెప్పారు. పోలీస్ శాఖ ప్రస్తుతం దాదాపు 10,500 వాహనాలను వినియోగిస్తోందని తెలిపారు. వాహనాలు పాతబడిపోవడం, నిరంతర వినియోగం కారణంగా పెద్ద సంఖ్యలో నిరుపయోగంగా మారాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఈ వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 2026-27 మార్కెటింగ్ సీజన్‌లో తోతాపురి మామిడికి మద్దతు ధర అమలు చేసేందుకు అవసరమైన నిధులను వర్కింగ్ క్యాపిటల్/స్వల్పకాలిక రుణాల ద్వారా సమీకరించేందుకు మార్క్‌ఫెడ్‌కు అనుమతిని పొడిగించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది పొగాకు కొనుగోలుకు ధరల లోటు భర్తీ మద్దతుగా కిలోకు రూ.10ల చొప్పున పొగాకు రైతులకు నేరుగా నగదు బదిలీ ద్వారా అందించేందుకు రూ.94కోట్లు మార్క్‌ఫెడ్‌కు సమకూర్చేందుకు అనుమతించిందన్నారు.
వెలిగొండపై ..
వెలిగొండ ప్రాజెక్టులోని టన్నెల్–2లో ఉన్న బోరింగ్ మెషీన్ వెలికతీసే పనులను మేఘా కంపెనీకి అప్పగించేందుకు ఆమోదం తెలిపిందని వివరించారు. కెనాల్ పోరంబోకు నుండి ఏడబ్ల్యూ డ్రై”గా మార్చేందుకు, అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు ఇంటి స్థల పట్టాలు జారీ చేసేందుకు చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపామన్నారు. జాయింట్ కమిటీ సిఫారసుల మేరకు 62.70 ఎకరాల్లో క్రియాశీల కాలువ ప్రాంతం, హైడ్రాలిక్ ఆపరేషనల్ జోన్, తప్పనిసరి 20 అడుగుల ఇరిగేషన్ రైట్ ఆఫ్ వే బఫర్ ప్రాంతాలను మినహాయించి, 22.31 ఎకరాల భూమిని పోరంబోకు, డ్రైగా వర్గీకరణ చేశామని తెలిపారు. కాలువ నీటి ప్రవాహ సామర్థ్యం, నిర్వహణ హక్కులకు ఎలాంటి ఆటంకం కలగకుండా రక్షణ చర్యలు కొనసాగిస్తూ, అర్హులైన పేద లబ్ధిదారులకు ఇంటి స్థల పట్టాలు జారీ చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఆర్‌విఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 800మెగావాట్ల అవుకు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కేటాయింపును రద్దు చేసే ప్రతిపాదనను ఆమోదించినట్లు చెప్పారు. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులోని ఇఅండ్‌ఎం, హెచ్అండ్‌ఎం పనులకు సంబంధించి ధర వ్యత్యాస లెక్కింపునకు ఎన్‌హెచ్‌పిసి విధానాన్ని పరిగణనలోకి తీసుకోవాలని మేఘా కంపెనీ అభ్యర్థనను కూడా ఆమోదించామన్నారు.
నూతన పౌల్ట్రీ విధానం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ “పౌల్ట్రీ అభివృద్ధి విధానం 2025-2029” ముసాయిదాను ఆమోదించినట్లు వివరించారు. ఈ పాలసీ ద్వారా పౌల్ట్రీ ఉత్పత్తి వ్యవస్థను మరింత ఆధునీకరించి, బయోసెక్యూరిటీ ప్రమాణాలను పెంపొందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, అదనపు ఆదాయ అవకాశాలు మెరుగుపడనున్నాయని తెలిపారు. గుడ్లు, కోళ్ల మాంసం లభ్యతతో వినియోగం పెరగడంతో పాటు ప్రాసెసింగ్, కోల్డ్‌చైన్ మౌలిక వసతులు, విలువ ఆధారిత ఉత్పత్తులు మరియు ఎగుమతులకు ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. జల్ జీవన్ మిషన్ (జెజెఎం 2.0) నిర్దేశించిన గడువులోగా గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేసి, "హర్ ఘర్ జల్" లక్ష్యాన్ని వేగవంతం చేసేందుకు ఆమోదం తెలిపామన్నారు. రూ. 4,053.85 కోట్ల అంచనా వ్యయంతో 13,252 పనులను పునరుద్ధరిస్తూ, పునర్వ్యవస్థీకరణతో పాటు పరిపాలనా ఆమోదం మంజూరు చేశామన్నారు.







కామెంట్‌లు (0)