- ఎపిఎస్‌డిఎంఎ ఎమ్‌డి ప్రఖర్ జైన్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటు తేలికపాటి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్(ఎపిఎస్‌డిఎంఎ) ప్రఖర్ జైన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోస్తాంధ్రలో గంటకు 40నుంచి50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న రెండు రోజులు ఈనెల19న (ఆదివారం) శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, కృష్ణా, ఎన్‌టిఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. 20న (సోమవారం) విజయనగరం, మన్యం, పోలవరం, విశాఖ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటలకు కోనసీమ జిల్లా ముమ్మడివరంలో 36.2 మిల్లీ మీటర్లు, పోలవరం జిల్లా ఎర్రంపేటలో 35.7 మిల్లీ మీటర్లు, కోనసీమ జిల్లా గంగవరంలో 29.7మిల్లీ మీటర్లు, పోలవరం జిల్లా బుట్టాయిగూడెంలో 27.2మిల్లీ మీటర్లు, కాకినాడ జిల్లా రాయభూపాలపట్నంలో 27.2 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. సముద్రం అలజడిగా ఉండి, అలలు ఉధృతంగా ఉన్నప్పుడు చిన్నబోట్లు ఉపయోగించే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.








కామెంట్‌లు (0)