స్వయం సహాయక సంఘాలపై గ్రామీణ బ్యాంకు నిర్ణయం
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అభినందన
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలుగా కొనసాగుతున్న మహిళలకు రుణ సదుపాయాలను మరింత సులభతరం చేసేలా ఎపి గ్రామీణ బ్యాంక్ తీసుకుంటున్న నిర్ణయాలు ఉన్నాయని ఎంఎస్‌ఎంఇ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సభ్యుల మరణం, వలసల కారణంగా సంఘంలో సభ్యుల సంఖ్య 10 మంది కంటే తగ్గితే, సంఘం సక్రమంగా పనిచేస్తున్నప్పటికీ తదుపరి విడత రుణం పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యేవన్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తూ 8 మంది సభ్యులున్నా రుణం మంజూరు చేసే విధంగా సడలింపు ఇవ్వడం అభినందనీయమని మంత్రి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం కనీసం 8 మంది క్రియాశీల సభ్యులు ఉన్న స్వయం సహాయక సంఘాలకు కూడా తదుపరి విడత రుణం మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అయితే సభ్యుల సంఖ్య తగ్గడానికి వలసలు, మరణం మాత్రమే కారణమై ఉండాలని, సంఘంలో ఎలాంటి అక్రమాలు లేకపోవడంతో పాటు, గత రుణ బకాయిలు లేకుండా సక్రమంగా చెల్లింపులు చేసి ఉండాలని స్పష్టం చేసిందన్నారు. అర్హత పొందిన సంఘాలు ప్రత్యేక తీర్మానం, బాధ్యతా పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సడలింపు కింద రుణం పొందిన సంఘాలు ఆరు నెలల్లోపు సభ్యుల సంఖ్యను తిరిగి కనీసం 10 మందికి పెంచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.







కామెంట్‌లు (0)