- రైతు సంఘం, ఎపి కౌలు రైతుల సంఘం డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సక్రమంగా బ్యాంకు రుణాలు చెల్లిస్తోన్న కౌలు రైతులు, ఆర్‌ఎంజి,జెఎల్‌జి గ్రూపుల సభ్యులకు రూ.2 లక్షల వరకు హామీ లేని పంట రుణాలు ఇవ్వాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, ఎపి కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ కు వినతిపత్రాన్ని అందించారు. రాష్ట్రంలో ఆర్‌ఎంజి, జెఎల్‌జి గ్రూపుల సభ్యులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు అందడం లేదని పేర్కొన్నారు. రూ.2 లక్షల వరకు హామీ లేకుండా పంట రుణాలు ఇచ్చేందుకు ఆర్‌బిఐ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో వాటి అమలు సక్రమంగా జరగడం లేదన్నారు. గతంలో రూ.1 లక్ష వరకు హామీ లేని పంట రుణాలు ఇచ్చేందుకు ఆర్‌బిఐ అనుమతులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం పంటల ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరగడంతో వివిధ పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను పెంచిందని వివరించారు. హామీ లేని పంట రుణాల పరిమితిని రూ.1.60 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచుతూ ఆర్‌బిఐ అనుమతినిచ్చిందని పేర్కొన్నారు. అయినప్పటికీ కౌలు రైతులకు ఈ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని విమర్శించారు. బ్యాంకు రుణాలను సక్రమంగా తిరిగి చెల్లిస్తున్న గ్రూపులు, వాటి సభ్యులకు రూ.లక్షకు మించి ఇచ్చేందుకు బ్యాంకులు వివిధ రకాల ఆటంకాలు కల్పిస్తున్నాయని తెలిపారు. కౌలు రైతులు, ఆర్‌ఎంజి, జెఎల్‌జి గ్రూపుల సభ్యులకు రూ.2 లక్షల వరకు హామీ లేని పంట రుణాలు అందేలా రాష్ట్రస్థాయి బ్యాంకు అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని కోరారు. అదనంగా అవసరమైన అర్హులైన రైతులకు షూరిటీ తీసుకుని రూ.5 లక్షల వరకు పంట రుణాలు అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. వినతిపై స్పందించిన వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ ఎస్‌ఎల్‌బిసి బ్యాంకు అధికారులతో మాట్లాడి కౌలు రైతులకు పంట రుణాలు అందేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్లు ఎం హరిబాబు తెలిపారు.








కామెంట్‌లు (0)