ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ప్రజాశక్తి-అమరావతి: సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. తీర్పు అనంతరం ఎలాంటి జాప్యం లేకుండా ఎన్నికల ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఎన్నికలను దశలవారీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశామన్నారు.స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా అధికారులు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించినట్లు పునేఠా తెలిపారు. గత రెండు నెలలుగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని అంశాలపై అధికారులు పని చేస్తున్నారని తెలిపారు. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ కోసం ప్రింటింగ్ ప్రెస్‌ను కూడా ఖరారు చేయనున్నట్లు చెప్పారు. 2026 ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఉన్న ఫొటో ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకుని ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తామని వెల్లడించారు. జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించి, అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.








కామెంట్‌లు (0)