- నిబంధనల ఉల్లంఘనపై చర్యలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా ప్రజా పరిషత్లు, నగర పంచాయతీలు, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళిని జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తేదీ నుంచి ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ నియమావళి అమల్లో ఉంటుందని శనివారం ఉత్తర్వుల్లో పేర్కొంది. రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు, మంత్రులు, ప్రభుత్వ అధికారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. కులం, మతం, ప్రాంతం ఆధారంగా ఓట్లు కోరడం, మతపరమైన ప్రదేశాలను ప్రచార వేదికలుగా వినియోగించడం, నిరాధార వ్యక్తిగత ఆరోపణలు చేయడం నిషేధమని తెలిపింది. సభలు, ఊరేగింపులకు ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ట్రాఫిక్కు ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. పోలింగ్ ముగియడానికి ముందు మునిసిపల్ ఎన్నికలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల విషయంలో 48 గంటల నుంచి, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 44 గంటల నుంచి ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఓటర్లకు లంచాలు ఇవ్వడం, పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ప్రచారం చేయడం, ఓటర్లకు ప్రయాణ సౌకర్యాలు కల్పించడం నిషేధమని స్పష్టం చేసింది.అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వ వనరులను ఎన్నికల ప్రచారానికి వినియోగించరాదని, కొత్త పథకాలు, ప్రాజెక్టులు, ఆర్థిక హామీలు ప్రకటించకూడదని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆదేశించింది. అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలను నమోదు చేసి, ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లో జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలని పేర్కొంది.నియమావళిని ఉల్లంఘించిన వారిపై సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే అధికారం జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసులకు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.








కామెంట్లు (0)