- సిసిటివిల ఏర్పాటుకు కలెక్టర్లకు ఆదేశాలు
- ఎస్ఇసి అనిల్ చంద్ర పునేఠా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు ఆదివారం చివరి రోజు కావడంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా పటిష్ట భద్రత కల్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. రాయచోటి, పులివెందుల, తిరుపతి, దర్శి, రాజంపేట, దాచేపల్లి తదితర ప్రాంతాల్లో ఉద్రిక్తతలపై వచ్చిన ఫిర్యాదులతో శనివారం సంబంధిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో సమీక్షించారు. ప్రతి అభ్యర్థి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా నామినేషన్ దాఖలు చేసుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు పెంచాలని, పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు నామినేషన్ కేంద్రాల్లో సిసిటివి కెమెరాలు తక్షణమే ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. నామినేషన్లకు అడ్డంకులు సృష్టించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సాగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ సమీక్షలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి మల్లికార్జున, ఐజి బి రాజకుమారి పాల్గొన్నారు. ఐజి సంబంధిత జిల్లాల ఎస్పిలతో మాట్లాడి భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు.







కామెంట్లు (0)