- ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అసోసియేషన్ డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: విజయవాడలోని కానూరులో ఉన్న శ్రీభవిష్య జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఐ భాగ్యరాజు మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రైవేటు టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. కళాశాల భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొవాలని అసోసియేషన్ కన్వీనర్ ఎం సూర్యారావు శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు యాజమాన్యాల ఒత్తిడి భరించలేక విద్యార్ధులు ఆత్మహత్యకు చేసుకోవడం చూశామని, ఇప్పుడు ఆ స్థాయి దాటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆత్మహత్యలు చేసుకునే దశకు యాజమాన్యాలు తీసుకువెళ్లాయని తెలిపారు. కనీస వేతనాలు, సెలవులు, గుర్తింపు, గౌరవం లేకపోయినా నిరుద్యోగం మూలంగా పని ఒత్తిడిని తట్టుకోని కుటుంబ అవసరాల కోసం 24గంటలు పని చేస్తున్న ప్రైవేటు టీచర్స్ లెక్చరర్స్ పై పని ఒత్తిడి, అవమానాలు పెరిగి పోతున్నాయని తెలిపారు. గతంలో నెల్లూరులో చైతన్య విద్యా సంస్థల వైస్ ప్రిన్సిపాల్ పనిచేసే చోట ఆత్మహత్య చేసుకున్నప్పుడే ప్రభుత్వం, అధికారులు కఠినంగా వ్యవహరించి ఉంటే ఈ ఘటనలు పునరావృతం అయ్యేవి కావని తెలిపారు. ప్రభుత్వ ఉదాసీనతే ఈ చావుకీ కారణమని, కాబట్టి ప్రభుత్వం, యాజమాన్యం కలిసి అతని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ ఘటనను ఇంటర్ బోర్డు రీజనల్ డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని, న్యాయం చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.








కామెంట్లు (0)