సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పారదర్శకత లేకపోవడం వల్లే లొసుగులు

2 రోజుల క్రితం

supreme
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 09:36 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- కొలీజియం సిఫార్సులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి భుయాన్‌

న్యూఢిల్లీ : జ్యుడీషియల్‌‌ నియామకాల్లో సుప్రీంకోర్టు కొలీజియం పారదర్శకంగా వ్యవహరించకపోవడం వల్ల లొసుగులు నెలకొంటున్నాయని, దీనివల్ల రాజ్యాంగ విరుద్ధంగా లేదా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసేవారు న్యాయ వ్యవస్థలోకి ప్రవేశించడానికి వెసులుబాటు లభిస్తోందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ ‌భుయాన్‌ ‌వ్యాఖ్యానించారు. ఇందుకు ఉదాహరణగా అలహాబాద్‌ ‌హైకోర్టు న్యాయమూర్తి విచారణ సందర్భంగా మైనారిటీ కమ్యూనిటీని ‘చీమల’తో పోల్చడాన్ని పేర్కొన్నారు. రాజ్యాంగ న్యాయస్థానాలకు చేసే సిఫార్సులకు గల కారణాలను వెల్లడించకపోవడం ద్వారా కొలిజియం, అర్హులైన అభ్యర్ధులు సాధించిన విజయాల గురించి తెలియకుండా ప్రజలను కూడా చీకటిలో వుంచుతోందని అన్నారు.

‘న్యాయ వ్యవస్థలో పారదర్శకత సూచీ : సుప్రీంకోర్టు, హైకోర్టుల ద్వారా సమాచారాన్ని అంచనా వేయడం’ అనే అంశంపై విధి సెంటర్‌ ‌ఫర్‌ ‌లీగల్‌ ‌పాలసీ తన నివేదికను ఆవిష్కరిస్తున్న కార్యక్రమంలో జస్టిస్‌ ‌భుయాన్‌ ‌కీలకోపన్యాసం చేశారు. కొలిజియం పారదర్శకతను పాటించకపోవడమనేది ఇటీవల నెలకొన్న పరిణామం అని ఆయన అన్నారు. న్యాయమూర్తుల పదోన్నతి, బదిలీలపై చర్చలు, సమాలోచనలు రహస్యంగా వుంటున్నాయని తెలిపారు. ఏదైనా సిఫార్సును తిరస్కరించడానికి లేదా వాయిదా వేయడానికి గల కారణాలు చాలా అరుదుగానే సంపూర్ణంగా వెల్లడవుతున్నాయని అన్నారు. సుప్రీం కోర్టు కొలిజియం చేసిన గత మూడు ప్రకటనలను చూసినట్లైతే వాటిలో ఏ సిఫార్సుకు కూడా ఎలాంటి కారణాలను వెల్లడించలేదని అన్నారు. చీఫ్‌‌ జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌నేతృత్వంలోని బెంచ్‌ ‌జులై 24న జారీచేసిన ఆదేశాలు, న్యాయస్థానం కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా పారదర్శకతను పాటించడానికి, ఆ ప్రక్రియను వాణిజ్యపరంగా దోపిడీ చేయడానికి, దుర్వినియోగం చేయడానికి మధ్య స్పష్టమైన రేఖను గీసిందని భుయాన్‌ ‌పేర్కొన్నారు. వాదనల సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలకు (తీర్పులు కాదు) సంచలనాత్మకమైన శీర్షికలతో ప్రచారం జరుగుతుండటంపై న్యాయస్థానం ఆందోళన చెందుతోందని తెలిపారు. అందువల్ల న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, లిటిగెంట్ల ప్రతిష్టకు హాని కలుగుతోందని, పైగా అసలు న్యాయస్థానాల్లో ఏం జరిగిందనే అంశంపై ప్రజలకు తప్పుడు అవగాహన కలుగుతోందని చెప్పారు. బహిరంగ న్యాయస్థానాలు చాలా వేగంగా ప్రజా విశ్వాసాన్ని చూరగొంటాయని అన్నారు. న్యాయస్థానమనేది ప్రజా వేదిక, న్యాయ వ్యవస్థ గురించి సహేతుకమైన వైఖరులను పెంపొందించడానికి ఈ బహిరంగ న్యాయస్థానాలకు ప్రజలకు ఉపకరిస్తాయని వివరించారు. పైగా కక్షిదారులు, ప్రజలు న్యాయస్థానం కార్యకలాపాలను చూసేందుకు అనుమతించడం ద్వారా న్యాయమూర్తులు నిష్పాక్షికమైన, సక్రమమైన రీతిలో చట్టాన్ని వర్తింపచేయడానికి హామీ కల్పించబడుతుందని అన్నారు. ప్రజలకు న్యాయం లభించడం, పారదర్శకత పాటించడమనేవి న్యాయానికి ఆత్మ వంటివని జస్టిస్‌ ‌భుయాన్‌‌ స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్