అమరావతి : విద్యుత్ రంగంలో బడా కంపెనీల దోపిడీని అరికట్టాలని సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబురావు డిమాండ్ చేశారు. విద్యుత్ నియంత్రణ మండలి ( ఈ ఆర్ సి) బుధవారం వివిధ అంశాలపై విచారణ జరిపింది. కర్నూలులోని ఈఆర్సీ ప్రధాన కార్యాలయంలో ఇన్చార్జి చైర్మన్ సివిఆర్. రెడ్డి అధ్యక్షతన జరిగిన విచారణలో సిపిఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబురావు విజయవాడ నుండి వర్చువల్ గా పాల్గొన్నారు.
హిందూజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్.. విశాఖలోని తమ 1040 మెగావాట్ల సామర్థ్యం కలిగిన, ధర్మల్ ప్లాంట్ల నుండి.. 2022 ఆగస్టు నుండి 2024 మార్చి నెలాఖరు వరకు సరఫరా చేసిన విద్యుత్ కు వేరియబుల్ కాస్ట్, క్యారీయింగ్ కాస్ట్ అదనంగా చెల్లించాలని పెట్టిన పిటిషన్లపై ఓపి. నెంబర్ 63/2025, 64/2025 లపై నేడు విచారణ చేపట్టింది. సెంట్రల్ పూల్ నుండి వివిధ సంస్థల నుండి మిగులు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఓపి. నెంబర్ 24 /2026 పై కూడా విచారణ చేపట్టారు. ముందుగానే ఈ అంశాలపై సిపిఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున సిహెచ్.బాబురావు ముందుగానే వ్రాతపూర్వకంగా తమ అభ్యంతరాలను మండలికి తెలిపారు. ఈ విచారణలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగంలో అవినీతిని అరికడతామని, విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని మాట ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కానీ నేడు దానికి భిన్నంగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ఆదేశాలకు లొంగి గత వైసిపి ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడానికి పూనుకున్నదని, షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థకు అక్రమంగా మీటర్ల కాంట్రాక్టులు కట్టబెట్టిందని మండిపడ్డారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థను వైసీపీ బినామీ సంస్థగా ఆరోపించి.. ఈ అక్రమ కాంట్రాక్టును రద్దు చేయాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారని అన్నారు. ప్రజా ఆందోళనతో వ్యవసాయ పంపుసెట్ల మీటర్ల ఏర్పాటును కూటమి ప్రభుత్వం రద్దు చేయక తప్పలేదని అన్నారు. మీటర్లు సరఫరా చేయకుండానే... ఒప్పందం రద్దుకు నష్టపరిహారం పేరుతో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ విష్ రెన్యువల్ లిమిటెడ్ కంపెనీకి అక్రమంగా రూ. 2.500 కోట్లు చెల్లించటానికి కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చిందని అన్నారు. ఇప్పటికే దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) లో షిరిడి సాయి సంస్థకు రూ.764.97 కోట్లను అక్రమంగా చెల్లించిందని అన్నారు. మీటర్లు సప్లై చేయకుండానే నష్టపరిహారం (లిక్విడేటెడ్ డ్యామేజెస్) పేరుతో రూ. 502.83 కోట్లు చెల్లించారని, మీటర్లు సప్లై చేశారన్న పేరు చెప్పి మరో 249.02 కోట్లు(జీఎస్టీ తో సహా) ,సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ పేరుతో మరో 13.10 కోట్ల రూ.. చెల్లించారని అన్నారు. వ్యవసాయ పంపుసెట్ల మీటర్ల విషయంలో మూడు పంపిణీ సంస్థలకు మొత్తంగా సుమారు రూ. 2,500 కోట్లకు పైగా అక్రమంగా చెల్లించారని, ఇది అవినీతి కాదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ తరఫున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాఖలు చేసిన పిల్ పెండింగ్ లో ఉండగానే, అదే కూటమి ప్రభుత్వం ఈ సంస్థకు అడ్డగోలుగా చెల్లింపులు చేయటం గర్హనీయమని అన్నారు. అక్రమ చెల్లింపులు ఆపటానికి ఈఆర్‌సి తగు చర్యలు తీసుకోవాలని, వీటిపై బహిరంగ విచారణ జరపాలని, ఇప్పటికే చెల్లించిన డబ్బును తిరిగి రాబట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు హిందూజా సంస్థ ..విదేశీ బొగ్గు వాడామని, రైల్వే లైన్ పూర్తి కాకపోవటంతో రోడ్డు రవాణా ద్వారా బొగ్గు సరఫరా జరిగిందని.. ఇలా వివిధ సాకులు చెప్పి వేరియబుల్ కాస్ట్ పెంచాలని, క్యారీయింగ్ కాస్ట్ .. అధిక చెల్లింపులు చేయాలని కోరటం అభ్యంతరకరమని అన్నారు. గతంలో ఇదేవిధంగా వైసీపీ, నేడున్న కూటమి ప్రభుత్వాలు హిందూజా సంస్థకు రూ.1200 కోట్లకు పైగా అక్రమంగా చెల్లింపులు చేశాయని అన్నారు. మళ్లీ అధిక చెల్లింపులు కొరకు న్యాయవివాదాలు సాగించడం, ప్రభుత్వం లొంగిపోవడం శోచనీయమని అన్నారు.
హిందూజా సంస్థ అధిక చెల్లింపుల పై పెట్టుకున్న విజ్ఞప్తులను మండలి తిరస్కరించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం మాట తప్పిందని, విద్యుత్ రంగంలో అవినీతిని పొంచి పోషిస్తున్నదని, ఇందులో నేతలే ప్రధాన పాత్ర పోషించడం దారుణమని అన్నారు. ఒకవైపున విద్యుత్ రంగంలో ఆదా చేస్తున్నామని,సగటు విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గించామని.. ప్రభుత్వ పెద్దలు చెబుతూ ప్రజలను మభ్యపరుస్తున్నారని, మరోవైపు అడ్డగోలు, అక్రమ చెల్లింపులు చేస్తూ వినియోగదారులపై భారాలను మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ నినో, పర్యావరణ మార్పుల వలన విద్యుత్ వినియోగం పెరిగిందని, రాష్ట్రంలో పలుచోట్ల అప్రకటిత విద్యుత్ కోతలు సాగుతున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, వ్యాపార సంస్థలు నష్టపోతున్నాయని అన్నారు. ప్రభుత్వ పెద్దలు కోతలు లేవని చెబుతున్నారు తప్ప, నిర్దిష్ట చర్యలు చేపట్టడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ కోతలను నివారించడానికి తగు చర్యలు తీసుకోవాలని, ఈఆర్‌సి సుమోటోగా దీనిపై స్పందించాలని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ మిగులు ఉందా? లోటు ఉందా? ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు స్పష్టం చేయాలని అన్నారు. పీక్ సమయం లోటు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని, నాన్ పీక్ సమయంలో విద్యుత్ మిగులు ఉన్నట్లు ప్రకటిస్తున్నారని అన్నారు. మరోవైపు అదాని సంస్థ ఏడు వేల మెగావాట్ల విద్యుత్ పూర్తిస్థాయిలో సరఫరా చేస్తే, ఆ విద్యుత్ ను ఎలా వినియోగిస్తారని ప్రశ్నించారు. వీటన్నిటిపై సమగ్రమైన నివేదిక రూపొందించాలని, దానికి అనుగుణంగానే వివిధ కేంద్ర సంస్థల నుండి కామన్ పూల్ నుండి విద్యుత్ కొనుగోలు చేయాలా? వద్దా ? అనే విషయంపై తగు నిర్ణయం తీసుకోవాలని అన్నారు. విద్యుత్ సరఫరా రేట్ల అంశంపైనా సమగ్రమైన చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ రంగంలో బడా కంపెనీల దోపిడీని అరికట్టాలి : సిహెచ్.బాబురావు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 04:22 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)