25 తులాల బంగారు, 50 తులాల వెండి ఆభరణాలు అపహరణ
అనంతరం ఇంటికి నిప్పు
ప్రజాశక్తి-గుంతకల్లు : అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రైల్వే ఉద్యోగిని ఇంట్లో చొరబడి బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరించారు. దొంగతనం అనంతరం ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో బాధితురాలికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కసాపురం రోడ్డు ఎబి ఫంక్షన్ హాల్ సమీపంలోని కోయనగర్‌లో రైల్వే ఉద్యోగిని ఉమాదేవి నివాసం ఉంటున్నారు. ఆమెకు ఇద్దరు కూతర్లు ఉన్నారు. వీరిద్దరూ మహారాష్ర్టలో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఉమాదేవి ఒక్కరే ఇంట్లో ఉంటూ రైల్వే విధులకు వెళ్లి వస్తున్నారు. బుధవారం రాత్రి ఆమె విధులకు వెళ్లారు. గురువారం వేకువజామున దొంగలు ఆమె తలుపు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి, బీరువాలోని 25 తులాల బంగారు, 50 తులాల వెండి ఆభరణాలు, రూ.25 వేల నగదును దోచుకున్నారు. చోరీ అనంతరం ఆ ఇంటికి నిప్పు పెట్టి పారిపోయారు. మంటల్లో బాధితురాలికి సంబంధించిన విలువైన డాక్యుమెంట్లు, ఎటిఎం కార్డులు, టివి, ఫ్రిజ్ ఇతర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంటి నుంచి పొగలు రావడం గమనించిన చుట్టుపక్కల వారు చూసి ఉమాదేవికి సమాచారం ఇచ్చారు. బాధితురాలు అక్కడికొచ్చి చూడగా ఇంట్లో దొంగతనంతో పాటు, విలువైన వస్తువులు మంటల్లో కాలిపోయినట్లు గుర్తించారు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ టిపి.వెంకటస్వామి డాగ్ స్వ్కాడ్, క్లూస్‌టీంతో ఇంటిని పరిశీలించారు. పెళ్ళిడుకొచ్చిన కూతుళ్ల కోసం దాచిన బంగారు, వెండి ఆభరణాలను మొత్తం దొంగలు ఎత్తుకెళ్లారని, డ్యూటీ డ్రెస్‌తో తనను రోడ్డున పడేశారంటూ బాధితురాలు పోలీసుల ఎదుట కన్నీటి పర్యవంతం అయ్యారు. ఘటనపై బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.








కామెంట్‌లు (0)