- మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
- రైతులకు రుణ మాఫీ చేయాలి
- రెండు రాష్ట్రాల రైతాంగ ఉద్యమాలకు మల్లారెడ్డి వారధి
- సంక్షోభంలో రైతాంగం
- ఎపి రైతు సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సారంపల్లి మల్లారెడ్డి మరణం.. తెలుగు రాష్ట్రాల రైతు ఉద్యమానికి, వ్యవసాయ రంగానికి తీరని లోటని మాజీ మంత్రి, రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మల్లారెడ్డి జీవితాంతం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. విజయవాడ బాలోత్సవ భవన్‌లో రైతు ఉద్యమ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి సంతాప సభ ఎపి రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ముందుగా మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. మల్లారెడ్డి ఎక్కువగా చదువుకోకపోయినా ఉద్యమ అనుభవం, పట్టుదలతో మార్క్సిజాన్ని లోతుగా అధ్యయనం చేశారని అన్నారు. వ్యవసాయ రంగంతో పాటు సాగునీటి సమస్యలు, విత్తన చట్టాలు, జన్యుమార్పిడి విత్తనాలు, రైతులకు సంబంధించిన విధానాలపై ఆయనకు సమగ్ర అవగాహన ఉండేదన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు వ్యవసాయ రంగానికి, రైతులకు అనుకూలంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు వారిపై మరింత భారాన్ని మోపేలా చట్టాలు, విధానాలు, కార్యక్రమాల్లో మార్పులు తీసుకురావడం సరికాదన్నారు. రాజ్యాంగం, చట్టాలను గౌరవిస్తూ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాలను కోరారు. మల్లారెడ్డి పటేల్ ఉద్యోగం నుంచి కమ్యూనిస్టు కార్యకర్తగా, నాయకుడిగా ఎదిగి, వరంగల్ ప్రాంతంలో కమ్యూనిస్టు, రైతు ఉద్యమాలను నిర్మించారని తెలిపారు. అంచెలంచెలుగా ఎదిగి అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టడం ఆయన ఉద్యమ జీవితానికి నిదర్శనమన్నారు. మల్లారెడ్డి ఏ ఆశయాల కోసం జీవితాంతం పోరాడారో, ఆ ఆశయాల సాధన కోసం కృషి చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.
ఎపి రైతు సంఘ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేయడానికి రైతు రుణ మాఫీ చేయాలని, అదే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. రైతుల భూములను కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత రైతు ఉద్యమంపై ఉందన్నారు. రైతాంగ సమస్యలపై మల్లారెడ్డి జీవితాంతం చేసిన కృషి స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వనరుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలనే వైఖరితో ఆయన పనిచేశారని, రెండు రాష్ట్రాల రైతాంగ ఉద్యమాలకు మల్లారెడ్డి వారధిగా నిలిచారని పేర్కొన్నారు. రెవెన్యూ వ్యవస్థ, వ్యవసాయ రంగం రెండూ పరస్పరం ముడిపడి ఉన్నాయని, రెవెన్యూ రికార్డుల కంప్యూటరీకరణ పేరుతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. భూముల వివరాలు తప్పుగా నమోదవ్వడం, ఒకరి భూమి మరొకరి పేరుపైకి వెళ్లడం వంటి సమస్యలతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మారుతున్న చట్టాలు, విధానాలపై నిరంతరం అధ్యయనం చేసి రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రైతుల అప్పుల సమస్య తీవ్రంగా మారిందన్నారు. రైతులతో పాటు వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, మధ్యతరగతి ప్రజలు, చిన్న వ్యాపారులు కూడా అప్పుల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పంటలకు ధరలు లేక ఒకవైపు, వాతావరణ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతినడం మరోవైపు రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ వ్యవసాయ కమిషన్ రైతు రుణాల రద్దుకు సిఫార్సు చేయాలని ఆయన కోరారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడకుండా కూడా రైతు రుణాల విషయంలో చర్యలు తీసుకోవచ్చని, ప్రభుత్వాన్ని ఒప్పించి రైతులకు ఉపశమనం కల్పించేందుకు కమిషన్ తన సిఫార్సు అధికారాన్ని వినియోగించాలని సూచించారు. కార్పొరేట్ సంస్థలకు ప్రత్యక్షంగా భూములు వెళ్లకుండా చట్టపరమైన పోరాటాల ద్వారా అడ్డుకోగలిగామని, అయితే ప్రస్తుతం రైతులతోనే భూములను విక్రయింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. భూములను అమ్ముకుని లాభపడటం కంటే, భూమిని కాపాడుకుంటూ వ్యవసాయం ద్వారా జీవించే పరిస్థితులను కల్పించడమే ప్రభుత్వాల లక్ష్యంగా ఉండాలని అన్నారు.
రాష్ట్ర వ్యవసాయ కమిషన్ వైస్ ఛైర్మన్ మరెడ్డి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. మల్లారెడ్డితో పనిచేసే అదృష్టం తనకు కలిగిందన్నారు. రైతు సమస్యలపై పూర్తి అవగాహన వ్యక్తి మల్లారెడ్డి అని కొనియాడారు. అధిక ఉత్పత్తి పేరుతో కార్పొరేట్ మాయాజాలంతో రైతులను అప్పుల ఊబిలోకి నెడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మాజీ వైస్ ఛైర్మన్ ఎంవిఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. 19 ఏళ్లపాటు ఆలిండియా కిసాన్ సభకు జాతీయ ఉపాక్షులుగా ఎన్నికవ్వడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఆయన పనిచేయడమే కాకుండా తన కుటుంబ సభ్యులను ఉద్యమాల్లో ఉండేలా చేశారన్నారు. అజాత శత్రువుగా పేరుగాంచిన మల్లారెడ్డికి డాక్టరేట్ ఇవ్వాలని ప్రతిపాదించాలని కోరారు. ఈ సంతాప సభలో ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్, రైతు సంఘం సీనియర్ నాయకులు వై కేశవరావు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు, రైతు కూలీ సంఘం నాయకులు వీరబాబు, మేకల ప్రసాద్, ఎం వెంకట్ రెడ్డి, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు, కోశాధికారి వై రాధాకృష్ణ, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎం సూర్యనారాయణ, జొన్న శివశంకర్‌రావు, వల్లూరు భారతి, పివి ఆంజనేయులు, గౌరిశెట్టి నాగేశ్వరరావు, కంచుమాటి అజయ్ కుమార్, జి రామకృష్ణ, ఆర్ చంద్రశేఖర్ రెడ్డి, కె శ్రీనివాస్, ఆకుల హరేరామ్, బుద్ధరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)