పేలుడు ధాటికి పూర్తిగా ధ్వంసమైన ఇల్లు.. ఒకరికి గాయాలు
ప్రజాశక్తి–అమలాపురం : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని మహిపాల వీధిలో ఆదివారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఉపాధ్యాయుడు ఎం.ఎస్.ఎన్.మూర్తికి చెందిన ఇల్లు పేలుడు ధాటికి పూర్తిగా ధ్వంసమైంది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో ఇంటి కిటికీలు ఊడిపోయి దూరంగా పడిపోయాయి. ఈ ఘటనలో మూర్తి కుమారుడు మలిశెట్టి సాయిరామ్ (24) గాయపడ్డారు. పేలుడు అనంతరం ఇంట్లో మంటలు చెలరేగడంతో స్థానికులు వాటిని అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పేలుడు సమయంలో ఇంటి పై అంతస్తులో ఉన్న సాయిరామ్‌కు చేతులు, కాళ్లకు సుమారు 20 శాతం కాలిన గాయాలైనట్లు అమలాపురం పట్టణ సీఐ వీరబాబు తెలిపారు. తొలుత అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కాకినాడలోని ట్రస్ట్ ఆస్పత్రికి తరలించనున్నట్లు సీఐ తెలిపారు. ప్రస్తుతం సాయిరామ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యే ఆనందరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇంటి యజమాని మూర్తి, కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధ్వంసమైన ఇంటిని పరిశీలించారు. డీఎస్పీ టి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ కూడా ఘటన స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పేలుడు కారణంగా జరిగిన ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.








కామెంట్‌లు (0)