సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
అక్టోబర్ 2న విశాఖలో కుటుంబ సభ్యులతో సత్యాగ్రహ దీక్ష
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ
ప్రజాశక్తి–విజయనగరం టౌన్ : కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైమ్, డైలీవేజ్, కంటింజెంట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 2న విశాఖపట్నంలోని గాంధీ విగ్రహం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి సత్యాగ్రహ దీక్ష నిర్వహించనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు, ఏపీ కేజీబీవీ ఎంప్లాయీస్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కె.విజయగౌరి తెలిపారు. ఆదివారం స్థానిక ఎన్‌పిఆర్ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సత్యాగ్రహ దీక్షకు సంబంధించిన గోడపత్రికను యూనియన్ నాయకులతో కలిసి వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సమాన పనికి సమాన వేతనం, పీఆర్సీ అమలు, రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంపు, మెడికల్ లీవులు, ఉద్యోగ భద్రత, చైల్డ్ కేర్ లీవులు తదితర హక్కులను కల్పించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉద్యోగులకు పలు హామీలు ఇచ్చిందని తెలిపారు. తమ సమస్యలను పలుమార్లు ప్రభుత్వం, అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి సత్యాగ్రహ దీక్షలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని వారు కోరారు. సమావేశంలో అర్బన్ హెల్త్ సెంటర్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు, ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు టి.సురేష్, రెండో ఏఎన్‌ఎంల యూనియన్ నాయకులు జి.ధనలక్ష్మి, ఎన్‌హెచ్‌ఎం కంటింజెంట్ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షులు పి.దుర్గారావు, జిల్లా అధ్యక్షులు బి.శ్రీనివాసరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ.జగన్మోహన్‌రావు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)