- క్షేత్రస్థాయిలో కేడర్‌ను సిద్ధం చేయండి
- ఇన్‌ఛార్జి మంత్రులకు సిఎం చంద్రబాబు ఆదేశం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలనూ గెలిపించుకురావాలని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కూటమిలో మూడు పార్టీల మధ్య ఐక్యత ఉండాలని, అంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం సహచర మంత్రులతో ఆయన విడిగా భేటీ అయ్యారు. తొలి దశలో మున్సిపాలిటీలు, రెండో దశలో జడ్‌పిపిటిసి ఎన్నికలు జరుగుతాయని, మూడో దశలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని వివరించారు. అందుకే మంత్రులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్‌ను కూడా సిద్ధం చేయాలని మంత్రులకు సూచించారు. ఈ విషయంలో ఇంకా అప్రమత్తత రావాలని సిఎం సూచించారు.
దుండగులు ఒకరే..
గతంలో పార్టీ కేంద్ర కార్యాలయంపై, ఇప్పుడు శాప్ కార్యాలయంపై జరిగిన దాడుల్లో కొంతమంది దుండగులు నేరుగా పాల్గొన్నారని సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆస్తులపై కూడా దాడులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అటువంటి వారిపై రైల్వే యాక్ట్ తరహాలో కఠిన చట్టం తీసుకురావాలన్నారు. సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వంపై చేస్తున్న అవాస్తవాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. రాజకీయ నాయకుల ముసుగులో అసాంఘిక శక్తులు విధ్వంసం సృష్టిస్తున్నారని, వైసిపి రౌడీ మూకలు అసాంఘిక శక్తుల ద్వారా అలజడి సృష్టించాలని చూస్తున్నాయని ఆరోపించారు.
జగన్‌పై తీవ్రంగా..
మాజీ సిఎం వైఎస్ జగన్‌పై సమావేశంలో తీవ్రంగానే స్పందించారు. మంత్రులు, సిఎం చంద్రబాబు కూడా ఆయనపై విమర్శలు చేసినట్టు తెలిసింది. రిమోట్ కంట్రోల్‌తో బెంగళూరులో కూర్చున్న జగన్ ఇక్కడ రౌడీ గ్యాంగ్‌తో అరాచకాలు చేస్తున్నారని మంత్రులు వ్యాఖ్యానించారు. లా అండ్ ఆర్డర్‌ను ఎవరు దెబ్బతీసినా చూస్తూ ఊరుకోనని, ప్రభుత్వాస్తులు ధ్వంసం చేస్తే రైల్వేలో ఉన్న చట్టాలను తీసుకొస్తానని సిఎం పేర్కొన్నారు. శాప్ కార్యాలయం వద్ద రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడిన తీరు బయటపడిందని, మీడియాలోనూ ఇది బాగా ఫోకస్ అయిందని ఓ మంత్రి అన్నారు. మీడియా వాస్తవాలు బానే చూపుతున్నా.. మంత్రులు దీనిని అందుకుని సరిగ్గా స్పందించట్లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తానే స్వయంగా మీడియాకు వాస్తవాలు వివరిస్తానన్నారు. ఉద్దేశపూర్వకంగా బురదజల్లితే పడేందుకు సిద్ధంగా లేమనేది ప్రత్యర్థులకు బలంగా చెప్పాలన్నారు. వర్షాలు బాగా పడుతున్నాయని, నూటికి నూరు శాతం పంటలు వేసేందుకు రైతులను ప్రోత్సహించాలని మంత్రులకు సూచించారు. రైతులకు అవసరమైన విత్తనాలివ్వాలన్నారు. మదనపల్లిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ నిర్మాణానికి అక్టోబరు రెండున శంకుస్థాపన చేయనున్నట్లు సిఎం చంద్రబాబు వెల్లడించారు.







కామెంట్‌లు (0)