బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాజ్యాంగ ధర్మాసనానికి ఇసిల నియామకం కేసు

1 గంట క్రితం

sc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 02:07 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- సిజెఐకి సిఫార్సు

- కేంద్ర ప్రభుత్వ విజ్ఙప్తిపై న్యాయమూర్తుల భిన్నాభిప్రాయాలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో: ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సిఇసి), ఇతర ఎన్నికల కమిషనర్ల (ఇసి) నియామకానికి సంబంధించిన 2023 చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం భిన్న తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనపై జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మలు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో కేసును తగిన సంఖ్యలో న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) ముందుంచేందుకు ఇద్దరు న్యాయమూర్తులు అంగీకరించారు. 2023లో పార్లమెంట్‌ ఆమోదించిన చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, ఇతర ఎలక్షన్‌ కమిషనర్ల చట్టంలో సిఇసి, ఇసిల నియామక కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ప్రధానమంత్రి నామినేట్‌ చేసే కేంద్ర మంత్రిని చేర్చారు. ప్రస్తుతం ఈ కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి నామినేట్‌ చేసిన కేంద్ర మంత్రి సభ్యులుగా ఉంటారు. ఈ మార్పునే పిటిషనర్లు సవాల్‌ చేశారు.

ఇసి స్వతంత్రంగా ఉందనే భావన ప్రజల్లో ఉండాలి: జస్టిస్‌ దత్తా

కేంద్రం కోరిన విధంగా కేసును విస్తృత ధర్మాసనానికి పంపాల్సిన అవసరం లేదని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయడం మాత్రమే కాకుండా, అది స్వతంత్రంగా పనిచేస్తుందనే నమ్మకం ప్రజల్లో కలిగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నామినేట్‌ చేసే కేంద్ర మంత్రి అదే ప్రభుత్వంలో భాగంగా ఉన్నందున, ప్రధానమంత్రికి వ్యతిరేకంగా స్వతంత్రంగా వ్యవహరిస్తారని ఆశించడం కష్టమని జస్టిస్‌ దత్తా వ్యాఖ్యానించారు. అటువంటి వ్యవస్థలో తటస్థ సభ్యుడు అందించే స్వతంత్ర ప్రతిస్పందనకు సమానమైన సమతుల్యత ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసం అత్యంత కీలకమని, ఎన్నికల సంఘం స్వతంత్రంగా ఉండటమే కాకుండా అది స్వతంత్రంగా ఉందనే భావన కూడా ప్రజల్లో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ పిటిషన్లలో గణనీయమైన రాజ్యాంగపరమైన ప్రశ్నలు ఉన్నందున వాటిని విస్తృత ధర్మాసనం తేల్చాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 145(3) ప్రకారం కనీసం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఇద్దరు న్యాయమూర్తుల మధ్య అభిప్రాయ భేదం ఉన్నప్పటికీ, ఈ వ్యవహారాన్ని మరో ధర్మాసనం వద్దకు పంపి, ఆ తర్వాత మళ్లీ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే ప్రక్రియ వల్ల మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. అందువల్ల నేరుగా సిజెఐ వద్దకు పంపి, తగిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించింది.

‘అనూప్‌ బరన్వాల్‌’ తీర్పు నేపథ్యంలో

ఈ వివాదానికి 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన అనూప్‌ బరన్వాల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా తీర్పు కీలక నేపథ్యంగా ఉంది. పార్లమెంట్‌ చట్టం చేసే వరకు సిఇసి, ఇసిల నియామకానికి ప్రధానమంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత, సిజెఐలతో కూడిన కమిటీని సుప్రీంకోర్టు సూచించింది. అయితే అనంతరం పార్లమెంట్‌ 2023లో కొత్త చట్టం తీసుకువచ్చి సిజెఐ స్థానంలో ప్రధానమంత్రి నామినేట్‌ చేసే కేంద్ర మంత్రిని నియామక కమిటీలో చేర్చింది. ఈ మార్పుతో నియామక కమిటీలో ప్రభుత్వానికి చెందిన ఇద్దరు సభ్యులు, ప్రతిపక్షానికి చెందిన ఒక సభ్యుడు ఉండే పరిస్థితి ఏర్పడిందని పిటిషనర్లు వాదిస్తున్నారు. మరోవైపు, పార్లమెంట్‌ తన శాసనాధికార పరిధిలోనే కొత్త నియామక వ్యవస్థను రూపొందించిందని కేంద్ర ప్రభుత్వం వాదించింది. అనూప్‌ బరన్వాల్‌ తీర్పు శాసనపరమైన ఖాళీని భర్తీ చేయడానికి మాత్రమే తాత్కాలిక వ్యవస్థను ఏర్పాటు చేసిందని కేంద్రం పేర్కొంది.

ఏళ్ల తరబడి జాప్యంపై ఆందోళన

విస్తృత ధర్మాసనాలకు పంపుతున్న రాజ్యాంగపరమైన కేసుల విచారణలో జాప్యం జరుగుతున్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. కొన్ని రాజ్యాంగపరమైన అంశాలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యాంగ కేసుల విచారణ కోసం శాశ్వతంగా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేసే అంశాన్ని సిజెఐ పరిశీలించాలని కోరింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం చెల్లుబాటు, ఎన్నికల సంఘం స్వతంత్రతకు రాజ్యాంగపరమైన రక్షణ, నియామక ప్రక్రియలో ప్రభుత్వ-ప్రతిపక్షాల పాత్ర వంటి కీలక అంశాలపై తుది నిర్ణయం ఇక రాజ్యాంగ ధర్మాసనం పరిధిలోకి వెళ్లనుంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్