బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జ్ఞానేష్‌ కుమార్‌కు కొనసాగే హక్కు లేదు!

55 నిమిషాల క్రితం

ceo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 01:42 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఇసిని సంస్కరించాలి : సిపిఎం పొలిట్‌బ్యూరో

​న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం (ఇసిఐ) చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక వెలువరించిన సంచలన కథనాలు ఇసిఐ విశ్వసనీయతపైనే తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ మేరకు బుధవారం పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి సిపిఎం, ఇతర ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజ సంస్థలు వ్యక్తం చేస్తూ వచ్చిన సందేహాలు, ఆందోళనలకు తాజా కథనాలు మరింత బలం చేకూర్చాయని తెలిపింది. ఎన్నికల సంఘంలోని ముగ్గురు కమిషనర్లలో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఓటర్ల జాబితా సవరణ, ఎస్‌ఐఆర్‌‌ అమలుకు సంబంధించిన పలు నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారని నివేదికలు స్పష్టం చేశాయని సిపిఎం పేర్కొంది.

చట్టం ప్రకారం ముగ్గురు ఎన్నికల కమిషనర్లు సమాన హోదా కలిగినవారని, విభేదాలను ఏకాభిప్రాయం లేదా మెజార్టీ ద్వారా పరిష్కరించుకోవాలని సిపిఎం తెలిపింది. అయితే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) ఈ నిబంధనను పాటించకుండా, తోటి కమిషనర్ల అభ్యంతరాలను పట్టించుకోకుండా తన అభిప్రాయాలనే ఏకపక్షంగా అమలు చేశారని పేర్కొంది. ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చడం, తొలగించడం, ఎస్‌ఐఆర్‌ అమలు తీరుకు సంబంధించిన మౌలిక అంశాలపైనే ఈ విభేదాలు ఉన్నాయంది. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, వికేంద్రీకృతంగా ఉందని సిఇసి జ్ఞానేష్ కుమార్ ఇన్నాళ్లూ చేసిన వాదన అబద్ధమని ఇప్పుడు స్పష్టమవుతోందని పార్టీ పేర్కొంది. గత కొన్ని నెలలుగా వ్యవస్థ మొత్తం కేంద్రీకృతమైపోయి, వాస్తవంగా నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో కూడా అస్పష్టంగా మారిపోయిందని తెలిపింది. సాంకేతికతపై అతిగా ఆధారపడటాన్ని, నోటీసుల జారీలో ‘‘యాంత్రిక’’ వైఖరిని సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే ఎత్తిచూపిందని పార్టీ గుర్తుచేసింది. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు లేవనెత్తిన అంశాలు కేవలం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకే పరిమితం కాదని, ఎన్నికల సంఘం సంస్థాగత సమగ్రత, ప్రజాస్వామ్య పనితీరు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, అతి కేంద్రీకరణ, సార్వత్రిక వయోజన ఓటు హక్కు పరిరక్షణ వంటి కీలక అంశాలతో ముడిపడి ఉన్నాయని పోలిట్‌‌బ్యూరో పేర్కొంది. నిష్పక్షపాత సంస్థగా ఎన్నికల సంఘం విశ్వసనీయతే ప్రమాదంలో పడిందని, రాజీపడిన ఎన్నికల సంఘంపై ప్రజలు నమ్మకం కోల్పోయారని, దీనికి సిఇసి జ్ఞానేష్ కుమారే బాధ్యత వహించాలని పేర్కొంది. ఆయన ఇకపై పదవిలో కొనసాగడానికి వీల్లేదని పార్టీ స్పష్టం చేసింది.

​ఎస్ఐఆర్‌ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని సిపిఎం పోలిట్‌‌బ్యూరో డిమాండ్‌ ‌చేసింది. అలాగే, ఎన్నికల సంఘం సమగ్రత, ప్రజాస్వామ్య పనితీరును పునరుద్ధరించాలని, ఎన్నికల కమిషనర్ల నియామకంలో పారదర్శకత తీసుకురావాలని, ప్రస్తుత చట్టాన్ని రద్దు చేసి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ఎంపిక కమిటీ ఏర్పాటుకు సంబంధించిన సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఆమోదిస్తూ కొత్త చట్టం తీసుకురావాలని కోరింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్