- సాఫ్ట్ టెన్నిస్‌లో జయ్ మీనాకు చారిత్రక కాంస్యం
- స్కీట్, బ్యాడ్మింటన్ టీం విభాగాల్లోనూ పతకాలు
ఐచి-నగోయా(జపాన్): 20వ ఆసియా క్రీడల్లో బుధవారం భారత్‌కు మరో ఐదు పతకాలు దక్కాయి. ఇందులో నాలుగు కాంస్య పతకాలుండగా.. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాభాయి ఛాను 28ఏళ్ల తర్వాత భారత్‌కు పతకాన్ని అందించింది. ఇక సాఫ్ట్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విభాగంలో జయ్ మీనా చారితాత్మక పతకం కైవసం చేసుకోగా.. స్కీట్, బ్యాడ్మింటన్ టీం విభాగాల్లో మొత్తం మూడు పతకాలు దక్కాయి. బుధవారం జరిగిన మహిళల 49కిలో విభాగంలో ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన మీరాభాయి ఛాను తొలిసారి ఆసియా క్రీడల్లో పతకంతో మెరిసింది. అంతర్జాతీయ టోర్నీల్లో అనేక పతకాలు సాధించిన మీరాబాయి ఇప్పటి వరకు ఆసియా గేమ్స్‌లో పతకాని అందుకోవడంలో విఫలమైంది. కానీ జపాన్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా గేమ్స్‌లో తన కలను నిజం చేసుకుంది. ఈ పోటీల్లో మీరాబాయి చాను స్నాచ్‌లో 83 కేజీలు, ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లోనూ వరుసగా 85కేజీలు, 87 కేజీలను విజయవంతంగా పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. ఇక క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీల బరువు ఎత్తి ఓవరాల్‌గా 198 కిలోల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. గతంలో రెండు సార్లు ఆసియా క్రీడల్లో పాల్గొన్నా.. తృటిలో పతకాన్ని చేజార్చుకుంది. దీంతో 28 ఏళ్ల తర్వాత ఆసియా గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత్ పతకం సాధించింది. 1998లో జరిగిన ఆసియా క్రీడల్లో కరణం మల్లీశ్వరి కాంస్య పతకంతో మెరిసింది. ఇక ఉత్తరకొరియా వెయిట్‌లిఫ్టర్ రి సాంగ్ గమ్.. 215 కేజీలు (స్నాచ్‌లో 94 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 121 కిలోలు) ఎత్తి బంగారు పతకం, ఇండోనేషియాకు చెందిన విజయన లులుక్(191కిలోలు) కాంస్య పతకాలు సాధించారు. దీంతో 28ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం సాధించిన మీరాభాయి ఛానుకు ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా అభినందలను తెలిపారు. ఆట పట్ల ఆమెకు ఉన్న అంకితభావం ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతోందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
స్కీట్‌లో రెండు కాంస్యాలు: ఆసియా క్రీడల స్కీట్ మహిళల, పురుషుల టీం విభాగాల్లో భారత్‌కు రెండు కాంస్య పతకాలు దక్కాయి. బుధవారం జరిగిన మహిళల స్కీట్‌లో పరినాజ్, దిలివాల్, రైజా దిల్లాన్, మహేశ్వరీ చౌహాన్‌లతో కూడిన భారత బృందం కాంస్య పతకాన్ని సాధించింది. ఇక పురుషుల షూటింగ్ స్కీట్ టీం విభాగంలో అనంత్‌తేజ్ సింగ్, భగత్ సింగ్ గిల్, మైరాజ్ అహ్మద్ ఖాన్‌లతో కూడిన భారత బృందం మరో కాంస్య పతకాన్ని అందుకుంది.
బ్యాడ్మింటన్ టీం విభాగంలో పతకం: పురుషుల బ్యాడ్మింటన్ టీం విభాగం సెమీఫైనల్లో భారతజట్టు 3-1తో చైనా చేతిలో ఓడి కాంస్య పతకానికి పరిమితమైంది. బుధవారం జరిగిన తొలి సింగిల్స్‌లో లక్షసేన్ వరుససెట్లలో చైనా ఆటగాడు షీ-యు-క్యూ చేతిలో ఓటమిపాలయ్యాడు. డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ 21-11, 22-20తో వాంగ్-లింగ్‌లను ఓడించారు. దీంతో స్కోర్ 1-1తో సమమైంది. మరో సింగిల్స్‌లో ఆయుష్ శెట్టి 19-21, 13-21తో లీ-షీ ఫెంగ్ చేతిలో ఓటమిపాల య్యాడు. దీంతో భారత్ 1-2తో వెనుకబడింది. ఆ తర్వాత డబుల్స్‌లో హరిహరన్-ఎంఆర్ అర్జున్ జంట మూడు సెట్ల హోరా హోరీ పోరులో 21-16, 17-21, 21-9తో చైనా జంట చేతిలో ఓడారు. దీంతో చైనా 3-1తో ఫైనల్‌కు చేరగా.. సెమీస్‌లో ఓడిన భారత జట్టుకు కాంస్య పతకం ఖాయమైంది. హాంగ్జౌ వేదికగా జరిగిన 19వ ఆసియా క్రీడల్లో రజత పతకంతో మెరిసిన భారత బృందం.. ఈసారి కాంస్య పతకానికే పరిమితమైంది.
సాఫ్ట్ టెన్నిస్‌లో చారిత్రాత్మక పతకం
ఆసియా క్రీడల సాఫ్ట్ టెన్నిస్ లో 26 ఏళ్ల జయ్ మీనా చారిత్రాత్మక పతకాన్ని అందించాడు. ఆసియా గేమ్స్ చరిత్రలో ఈ క్రీడలో భారత్‌కు పతకం దక్కడం ఇదే తొలిసారి. బుధవారం జరిగిన సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన టకుయా కురోసాకా చేతిలో ఐదుసెట్ల హోరాహోరీ పోరులో ఓటమిపాలయ్యాడు. 45 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ ప్రారంభంలో జయ్ వరుసగా మూడు గేమ్‌లు ఓడిపోయి ఒత్తిడిలో పడ్డాడు. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుసగా రెండు గేమ్‌లను (4-1, 6-4) తన ఖాతాలో వేసుకుని మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చాడు. అయితే, చివరి ఆరో గేమ్‌లో కురోసాకా ఆధిపత్యం ప్రదర్శించడంతో జయ్ మీనా 2-4 (3-5, 1-4, 1-4, 4-1, 6-4, 1-4) తేడాతో ఓటమి పాలై కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. 1994 నుంచి ఆసియా గేమ్స్‌లో సాఫ్ట్ టెన్నిస్‌ను ప్రవేశపెట్టారు.







కామెంట్‌లు (0)