- కన్సెలింగ్‌లో 96 సీట్లు కోల్పోయిన రిజర్వుడ్ అభ్యర్థులు
- లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విజయకుమార్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్య ప్రవేశాల కౌన్సెలింగ్ మార్గదర్శకాలకు సంబంధించి జారీ చేసిన జిఓ 102ను రద్దు చేసి, పాత ఉత్తర్వులైన 151 ప్రకారమే కౌన్సెలింగ్ నిర్వహించాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఐఎఎస్ అధికారి విజయకుమార్ డిమాండ్ చేశారు. విజయవాడలోని ఎంబివికెలో ఆంధ్రప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆలా వెంకటేశ్వర్లుతో కలిసి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి సత్యకుమార్ యాదవ్ బిసి తరగతికి చెందిన వ్యక్తి అయినప్పటికీ బిసిలకు అన్యాయం జరుగుతుంటే ఆయన ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ జిఓ వల్ల రిజర్వుడ్ మెరిటోరియస్ విద్యార్థులకు జరిగే అన్యాయాన్ని తాను కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకముందే వెల్లడించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించారని తెలిపారు. ఈ ప్రక్రియలో మొదటి విడతలో 70 మంది ఆంధ్రా, ఎస్‌వి విశ్వవిద్యాలయాల పరిధిలో రిజర్వుడ్ కేటగిరిల అభ్యర్థులు నష్టపోయారన్నారు. వీరంతా ఓపెన్ కేటగిరిలో అవకాశాలు వచ్చినా ప్రభుత్వ నిర్ణయం వల్ల సీట్లు కోల్పోయారని తెలిపారు. తాజాగా నిర్వహించిన రెండో విడత కౌన్సెలింగ్‌లో ఓపెన్ కేటగిరిలో 73,705 ర్యాంకు సాధించిన వ్యక్తికి సీటు లభించిందన్నారు. దీనికంటే మెరుగైన ర్యాంకు సాధించిన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు 26 మంది ఉన్నారని, వీరెవరికీ ఓపెన్ కేటగిరిలో సీటు దక్కలేదన్నారు. మొదటి, రెండో విడతల్లో కలిపి 96 మంది రిజర్వుడ్ కేటగిరి విద్యార్థులు ఓపెన్ కేటగిరిలో సీట్లు కోల్పోయారని వెల్లడించారు. ఆప్షన్లు మార్చుకునే అవకాశం గతంలో ఉండేది కాదని, 102 జిఓతో కల్పించినట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవంగా ఆప్షన్లు మార్చుకునే అవకాశం లేదన్నారు. యడవల్లి సాయికార్తీక్ గణేష్ విషయంలో ఈ విధంగా ఆప్షన్లు మార్చేందుకు ప్రయత్నించినా వెబ్‌సైట్ డిజేబుల్ చేసిందన్నారు. ఓపెన్ కేటగిరిలో సీట్లు సాధించిన రిజర్వు కేటగిరిలోని ప్రతి ఒక్కరికీ వాటిని కేటాయించిన అనంతరమే రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు.







కామెంట్‌లు (0)