- 11న బ్యాంకు ఉద్యోగులు చేపడుతున్న సమ్మెకు మద్దతు
- సిఐటియు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఉద్యోగుల రెగ్యులరైజేషన్, వేతన సమస్యలపై ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర , ప్రధాన కార్యదర్శులు సిహెచ్ నరసింగరావు, ఎవినాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. వైద్య, ఆరోగ్యశాఖలో తాత్కాలిక పద్ధతిలో ఏళ్ల తరబడి ఉద్యోగులను కొనసాగించడం సరికాదని, ఈ అంశంపై గతంలోనే హైకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. నేషనల్ హెల్త్ మిషన్‌లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, ఎఎన్‌ఎంలతో పాటు దాదాపు 186 క్యాడర్లకు చెందిన కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ఇఎస్‌ఐ ఆసుపత్రుల్లోని వివిధ క్యాడర్ల సిబ్బంది, డిఎంఇ, సెకండరీ హెల్త్, సిహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు శాశ్వత స్వభావం కలిగిన పనులనే నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా ఔట్‌సోర్సింగ్, ఆప్కాస్ ఉద్యోగులు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుని న్యాయం చేయాలని కోరారు. ఈనెల 11న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులు, అధికారులు చేపట్టనున్న సమ్మెకు సిఐటియు పూర్తి మద్దతు ప్రకటించింది. ఉద్యోగులకు ఇచ్చే ఇన్సెంటివ్‌లను బ్యాంకుల వారీ ఫలితాలకు అనుగుణంగా అందరికీ వర్తింపజేయడం, ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు వంటి అంశాలపై యూఎఫ్‌బియు, బ్యాంకు మేనేజ్‌మెంట్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని మోడీ ప్రభుత్వం ఇప్పటివరకు ఆమోదించలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బ్యాంకు ఉద్యోగులు చేపడుతున్న సమ్మెకు కార్మిక సంఘాలు, ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. యుఎఫ్‌బియు, బ్యాంకు మేనేజ్‌మెంట్ల సంఘాలతో సెంట్రల్ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చలు కూడా కొలిక్కి రాకపోవడంతో సమ్మెకు వెళ్లాలని ఉద్యోగులు నిర్ణయించుకున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని స్థాయిల సిఐటియు కమిటీలు బ్యాంకు ఉద్యోగులకు మద్దతుగా ధర్నాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.







కామెంట్‌లు (0)