అస్వస్థతకు గురైన బాధితులకు ఐటిడిఎ పిఒ పరామర్శ
మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం, ఉద్యోగం ఇవ్వాలి : సిపిఎం
ప్రజాశక్తి - ఎటపాక (పోలవరం జిల్లా)/ అమరావతి బ్యూరో : వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చిన యాంటీ మలేరియా డ్రగ్ మాత్రలతో అస్వస్థతకు గురైన గొల్లగుప్ప గ్రామానికి చెందిన 71 మంది క్రమంగా కోలుకుంటున్నారు. అస్వస్థతకు గురైన వారిలో కొంతమందిని లక్ష్మీపురం పిహెచ్‌సికి, పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నవారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి మడివి జమున మంగళవారం రాత్రి మరణించారు. దీంతో మన్యం ఒకసారిగా ఉలిక్కిపడింది. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చింతూరు ఐటిడిఎ పిఒ శుభం నొక్వాల్ మంగళవారం రాత్రి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మరోవైపు గొల్లగుప్ప గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు.
సిపిఎం బృందాన్ని అడ్డుకున్న పోలీసులు
మాత్రలు వికటించడంతో మరణించిన రెండో తరగతి విద్యార్థిని మడివి జమున మృతదేహానికి మంగళవారం అర్ధరాత్రి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని గొల్లగుప్ప గ్రామానికి తరలించారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామాన్ని సందర్శించడానికి వెళ్తున్న సిపిఎం బృందాన్ని బండి రేవు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 52 మందిలో 47 మంది చిన్నారులు ఉండగా వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. సిపిఎం పోలవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్, ఆదివాసీ అడ్వకేట్ మడివి రవితేజ, సిపిఎం ఎటపాక మండల కార్యదర్శి కాకా అర్జున్ భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన మలేరియా మాత్రల వల్ల మృతి చెందిన జమున కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని, రూ.25 లక్షల పరిహారం తక్షణం అందజేయాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కిరణ్ డిమాండ్ చేశారు. జమున కుటుంబాన్ని పరామర్శించడానికి గ్రామానికి వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. మలేరియా మాత్రలు ఇచ్చే ముందు కనీసం గ్రామస్తులకు అవగాహన కల్పించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ ఆరా
గొల్లగుప్ప గ్రామంలో 53 మంది అస్వస్థతకు గురైన సంఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. రెండో తరగతి చదువుతున్న బాలిక మృతి చెందడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. బాలిక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలవరం జిల్లా కలెక్టర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన బాధితుల ఆరోగ్యస్థితి నిలకడగా ఉందని, ప్రత్యేక వైద్య బృందాన్ని పంపి ఆ గ్రామంలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. గ్రామస్తులందరికీ తక్షణం సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, పంపిణీ చేసిన మలేరియా మందులను ల్యాబ్ కు పంపి శాస్త్రీయ పరీక్షలు నిర్వహించాలని పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులకు సూచించారు.







కామెంట్‌లు (0)