బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపరిశ్రమలతో కాలేజీలు అనుసంధానం

54 నిమిషాల క్రితం

lokesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 11:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఉన్నత విద్య బలోపేతంపై దృష్టి

  • నర్సరావుపేట జెఎన్‌‌టియు విద్యార్థులతో ముఖాముఖిలో మంత్రి లోకేష్

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : విద్యావ్యవస్థలో మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని విద్య ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇంజనీరింగ్ నాలుగేళ్లు చదివిన తర్వాత ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో కాలేజీలను పరిశ్రమలతో అనుసంధానం చేస్తున్నామన్నారు. బుధవారం పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం కాకానిలోని జెఎఎన్‌‌టియుకె ఇంజనీరింగ్ కళాశాల నూతన వసతి గృహాలను ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో మంత్రి ముఖాముఖీ నిర్వహించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ..గత రెండేల్లో పాఠశాల విద్య బలోపేతానికి తీసుకున్న చర్యల వల్ల అనేక సత్ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్నత విద్యపైనా ప్రత్యేక దృష్టి సారించామని... ల్యాబ్స్, స్కిల్ సెంటర్స్ ఏర్పాటుతో పాటు పరిశ్రమలతో కాలేజీల అనుసంధానంపై దృష్టి పెట్టామని తెలిపారు. అయితే, విద్యావ్యవస్థలో పూర్తిస్థాయి మార్పులు రావడానికి కనీసం పదేళ్ల సమయం పడుతుందన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకువస్తున్నామని, ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, సిమెంట్, స్టీల్, గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ వంటి క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కియా, హీరో మోటార్స్ వంటి కంపెనీలు వచ్చాయని, త్వరలో మరిన్ని కంపెనీలు రాబోతున్నాయని తెలిపారు. ఫిజిక్స్, మెటీరియల్ సైన్సెస్, స్పేస్, థర్మోడైనమిక్స్ వంటి సబ్జెక్టులపైనా దృష్టిసారించాలని, దేశంలో ఐఐటి, ఎన్ఐటిలు చాలా బలంగా ఉన్నాయని వీటిల్లో సీటు కోసం కష్టపడి చదవాలని విద్యార్థులకు సూచించారు. పల్నాడు, అనకాపల్లికి తేడా ఏంటని ఈ సందర్భంగా ఓ విద్యార్థినిని మంత్రి ప్రశ్నించారు. అనకాపల్లిలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని, ఇక్కడ వరి పండిస్తే..అక్కడ చెరకు పండిస్తారని విద్యార్థిని బదులిచ్చారు. ​యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎంపిలు లావు శ్రీకృష్ణదేవరాయులు, భాష్యం రామకృష్ణ, మంత్రి గొట్టిపాటి రవి తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్