బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసిఎం రిలీఫ్‌ ఫండ్‌ నిధుల గోల్‌‌మాల్‌

4 గంటల క్రితం

editedimage-1788890155713-3311.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 04:40 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • నరసరావుపేట ఎమ్మెల్యే కార్యాలయంలో చేతివాటం

  • అరవిందబాబు సొంత ఆస్పత్రిని బ్లాక్‌ లిస్టులో పెట్టిన సిఎంఒ

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : పేద రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్‌ఎఫ్‌) నుంచి అందిస్తున్న సహాయంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని నిర్ధారణ కావడంతో పల్నాడు జిల్లాలో నరసరావుపేట టిడిపి శాసనసభ్యుడు చదలవాడ అరవిందబాబుకు చెందిన అమూల్య నర్సింగ్‌ హోమ్‌ ను అధికారులు బ్లాక్‌ ‌లిస్టులో పెట్టారు. ఈ ఆసుపత్రికి తొలుత ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేశారు. తర్వాత సిఎంఆర్‌ఎఫ్‌ ‌నిధులు దారిమళ్లినట్టు గుర్తించి వాటినీ నిలిపివేయాలని నిర్ణయించారు. టిడిపి ఎమ్మెల్యే పంపుతున్న సిఫార్సు లేఖలను కూడా బ్లాక్‌ ‌లిస్టులో పెట్టాలని ముఖ్యమంత్రి కార్యాలయం నిర్ణయించింది. గత కొన్ని నెలలుగా సిఎంఆర్‌ఎఫ్‌ నిధుల కోసం ఎమ్మెల్యే పంపుతున్న దరఖాస్తులకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని సిఎం కార్యాలయం ఆలస్యంగా గుర్తించింది. చికిత్స అందించకుండానే అందించినట్లు బిల్లులు, చికిత్సకు సంబంధించిన ఫైళ్ల రూపకల్పనలో ఎమ్మెల్యేకు చెందిన ఆస్పత్రి వైద్యులతోపాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయినట్లు సమాచారం. ఎవరికి కావాలంటే వారికి అడిగినంత కమీషన్‌ ఇస్తే బిల్లులు, చికిత్సలకు సంబంధించిన ప్రొసిజర్‌ ‌ఫైల్స్‌‌ను రూపకల్పన చేయడానికి నర్సరావుపేటలో ఒక రాకెట్‌ ‌పనిచేస్తుందని తెలిసింది. ఇందులో ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన సహాయకులుగా పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు కీలక భూమిక పోషించారని సమాచారం. పేదలు చికిత్సల కోసం సిఎం కార్యాలయానికి దరఖాస్తు చేసుకుంటే ముందస్తు అనుమతిగా ఎల్‌ఒసి ఇస్తారు. దీనిలో కూడా అక్రమాలు జరిగాయని గుర్తించారు. చికిత్సల తర్వాత పేదలకు సిఎం రిలీఫ్‌ ‌ఫండ్‌‌ నుంచి ఆర్థిక సాయం అందించాలంటే సంబంధిత ప్రజాప్రతినిధులు సిఫార్సు చేయాలి. ఇందుకు సంబంధించి బిల్లులు, ఆస్పత్రి ప్రొసిజర్స్‌, వ్యాధుల రాకుండానే వచ్చినట్టు చూపడం అన్ని స్థాయిలో అక్రమాలు జరిగినట్టు గుర్తించడంతో ముఖ్య కార్యాలయం అధికారులు అంతర్గత పరిశీలన, మెడికల్‌ ‌బోర్డు విచారణ అనంతరం నర్సరావుపేట ఎమ్మెల్యే సిఫార్సు లేఖలను, ఎల్‌‌ఒసిలను, సంబంధిత ఆస్పత్రిని బ్లాక్‌ ‌లిస్టులో పెట్టినట్టు తెలిసింది. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద్‌బాబు ఆధ్వర్యంలో నడుస్తున్న అమూల్య నర్సింగ్‌ హోమ్‌ నుంచి పంపుతున్న బిల్లులపై మెడికల్‌ హెల్త్‌ బోర్డు నిర్వహించిన విచారణలో ఆసుపత్రిలో చికిత్స పొందకపోయినా చికిత్స జరిగినట్లు చూపిస్తూ పెద్ద సంఖ్యలో బిల్లులు రూపొందించినట్లు, ఇప్పటికే జరిగిన చికిత్సలకు సంబంధించిన పత్రాలను ఆధారంగా చూపించి బిల్లుల్లో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించినట్టు సమాచారం. ఈ వ్యవహరంలో ఎమ్మెల్యే అనుచరులుగా ఉన్న బాజీ, చంద్ర, ఖాసీం అనే ముగ్గురు వ్యక్తుల పాత్రపై అధికారులు విచారణ చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్