జాతీయ మావన హక్కుల కమిషన్‌కు ఎంపి గురుమూర్తి ఫిర్యాదు
సుమోటోగా కేసు విచారణ జరపాలని వినతి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : విజయవాడలోని గాదె సాయికృష్ణ మృతిపై తక్షణం జోక్యం చేసుకుని వారి కుటుంబానికి న్యాయం చేయాలని వైసిపి ఎంపి గురుమూర్తి జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు శ్రుకవారం ఫిర్యాదు చేశారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజుపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన రెండు వేర్వేరు సంఘటనలు పోలీసుల జవాబుదారీతనం, అధికార దుర్వినియోగం, కస్టడీ రక్షణ, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం హామీ ఇవ్వబడిన జీవించే ప్రాథమిక హక్కు పరిరక్షణపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని అందులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై నిష్పాక్షికమైన విచారణ జరపాలని కోరారు. ఒకే స్టేసన్కు సంబంధించి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకర అంశమని తెలిపారు. కస్టడీ హింస జరిగి ఉండవచ్చనే అనుమానాలకు తావిచ్చే పద్ధతిలో సాయికృష్ణ మృతిచెందారని తెలిపారు. కృష్ణలంక పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోందని, అతని మరణానికి దారితీసిన పరిస్థితులపై నిర్ధారణ కానప్పటికీ, జరిగిన పరిణామాలు కస్టడీలో ఉన్నప్పుడే మరణించి ఉండవచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయని తెలిపారు. అతనిని శారీరక చిత్రహింసలకు, కస్టడీ వేధింపులకు గురిచేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారని మరణానికి ముందు మృతునికి తగిలిన గాయాల ఫోటోలు కూడా బయటకు వచ్చాయని తెలిపారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనని తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993 ప్రకారం గాదె సాయికృష్ణ అనుమానాస్పద మృతిని సుమోటోగా స్వీకరించాలని కోరారు. అతని నిర్బంధం, కస్టడీ, చికిత్స మరణానికి దారితీసిన పరవస్థితులపై స్వతంత్ర, నిష్పాక్షిక కాలపరిమితితో కూడిన విచారణకు ఆదేశించాలని కోరారు. అతని అరెస్టు, నిర్బంధం, మూవ్‌మెంట్ రిజిస్టర్లు, స్టేషన్ డైరీ ఎంట్రీలు, సీసీటీవీ ఫుటేజ్, వైద్య రికార్డులు, పోస్ట్‌మార్టం నివేదికలు, ఫోరెన్సిక్ నివేదికలు, కమ్యూనికేషన్ రికార్డులకు సంబంధించిన అన్ని రికార్డులను తెప్పించుకోవాలని కోరారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి తగిన పరిహారం ఇచ్చేలా సిఫార్సు చేయాలని కోరారు. అదే స్టేషన్లో పేరుపోగు క్రాంతి కుమార్ చనిపోవడానికి ముందు స్వయంగా రికార్డ్ చేసిన వీడియో బయటకు వచ్చిందని, అది కూడా కృష్ణలంక సిఐ వేధింపులు తట్టుకోలేక చనిపోయిన ఘటనేనని తెలిపారు. మూడు నెలలుగా నిరంతరం వేధింపులు మానసిక చిత్రహింసలకు గురయ్యానని పేర్కొన్నాడని తెలిపారు. దానికి సిఐ నాగరాజు కారణమని ప్రత్యేకంగా పేరు పేర్కొన్నాడని తెలిపారు. ఈ కేసులోనూ మృతుడు స్వయంగా రికార్డ్ చేసిన వీడియోలోని ఆరోపణలను సుమోటోగా స్వీకరించాలని కోరారు. వైరల్ వీడియో, మొబైల్ ఫోన్, కాల్ డేటా రికార్డులు, ఎలక్ట్రానిక్ పరికరాలు అన్ని సంబంధిత డిజిటల్ ఆధారాలను భద్రపరిచేలా ఆదేశించాలని కోరారు.









కామెంట్‌లు (0)