శనివారం, 11 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో నారా బ్రాహ్మణికి చోటు

2 గంటల క్రితం

Nara Brahmani
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 11:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • అడ్డంకులను చెరిపేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలవాలన్న లోకేశ్‌

  • కోడలి విజయంపై హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి : హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యువ పారిశ్రామికవేత్త నారా బ్రాహ్మణి మరో అరుదైన జాతీయ స్థాయి గౌరవాన్ని అందుకున్నారు. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ ఇండియా ఏటా ప్రకటించే '100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్' 2026 జాబితాలో ఆమెకు చోటు దక్కింది. వ్యాపారం, పరిశ్రమలు, నాయకత్వం, సామాజిక సేవ వంటి రంగాల్లో విశేషమైన కృషి చేసి, తమదైన ముద్ర వేసిన మహిళలకు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం కల్పిస్తారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను విజయపథంలో నడిపిస్తున్నందుకు గాను బ్రాహ్మణి ఈ గుర్తింపును పొందారు.

ఈ విజయం పట్ల ఆమె భర్త, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. "ఫార్చ్యూన్ ఇండియా 100 మంది ప్రభావశీల మహిళల జాబితాలో బ్రాహ్మణి చోటు సంపాదించడం ఎంతో గర్వంగా ఉంది. ఇలాగే ముందుకు సాగుతూ మరెన్నో విజయాలు సాధించాలి. అడ్డంకులను చెరిపేస్తూ మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలి" అంటూ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా అభినందనలు తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తన కోడలు సాధించిన ఈ ఘనతపై ప్రత్యేకంగా స్పందించి ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ఓ పోస్ట్ చేశారు. "ఫార్చ్యూన్ ఇండియా 100 మంది శక్తిమంతమైన మహిళల జాబితాలో గుర్తింపు పొందిన బ్రాహ్మణికి హృదయపూర్వక అభినందనలు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు ఆమె నాయకత్వ పటిమ, అంకితభావం, నిబద్ధతకు నిదర్శనం.. ఆమె మా కుటుంబానికి గర్వకారణంగా నిలుస్తూనే, ఎందరో యువతులకు, ముఖ్యంగా మన తెలుగు ఆడబిడ్డలకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా స్ఫూర్తినిస్తోంది. భవిష్యత్తులో ఆమె మరిన్ని మైలురాళ్లను అధిగమించి, అన్ని ప్రయత్నాల్లోనూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను" అని చంద్రబాబు తన పోస్టులో తెలిపారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్