- బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జాతీయ చైర్మన్ అనిల్ కుమార్ వెల్లంకి
ప్రజాశక్తి -హైదరాబాద్ బ్యూరో : దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న బ్యాంకుల దేశ వ్యాప్త సమ్మె చేపట్టనున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జాతీయ చైర్మన్ అనిల్ కుమార్ వెల్లంకి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించి, సమస్యలను సంతృప్తికరంగా పరిష్కరించకపోతే, ఈ నెల 28, 29, 30వ తేదీలలో మూడు రోజుల పాటు మళ్లీ తదుపరి దేశ వ్యాప్త సమ్మె జరిపి తీరుతామని హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్, బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో అసోసియేషన్ జాతీయ సంయుక్త కార్యదర్శి పి మురళీ, ఎపి, తెలంగాణ అధ్యక్షులు ఐ హరనాథ్, ప్రధాన కార్యదర్శి ఎస్ సుబ్రహ్మణ్యం, ఎఐఐడిబిఐఒఎ నేత విట్టల్, కెబిఒఎ నేత సుగీత తదితరులతో కలిసి అనిల్ కుమార్ మాట్లాడుతూ బ్యాంకు పని తీరు, వ్యాపారం, లాభాలు ఏ ఒక్క అధికారి లేదా ఎగ్జిక్యూటివ్ కృషి వల్ల మాత్రమే సాధ్యం కాదని, సబ్‌స్టాఫ్, క్లరికల్ సిబ్బంది, అధికారులు, సీనియర్ అధికారులు, ఎగ్జిక్యూటివ్‌లు అందరి సమిష్టి కృషి ఫలితంగానే నేడు బ్యాంకింగ్ వ్యాపారం లాభదాయకంగా నడుస్తుందని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను లాభాల్లో నడిపిస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ లు వివక్ష చూపుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులను డిజిన్వెస్ట్మెంట్ పేరుతో ప్రైవేటు పరం చేసి ప్రజల సొమ్ము లూటీకి మార్గం చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చర్చల సందర్బంగా కార్మిక సంఘాల మధ్య కుదిరిన అవగాహన ఉన్నప్పటికే ఐదు రోజుల బ్యాంకింగ్ వారాన్ని, పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. జాతీయ ప్రయోజనాలకు విరుద్దంగా లాభాల్లో నడుస్తున్న ఐడిబిఐ బ్యాంకును డిజిన్వెస్ట్మెంట్ చేసి ప్రభుత్వ యాజమాన్యాన్ని గణనీయంగా తగ్గించి, ప్రైవేట్ లేదా విదేశీ పెట్టుబడిదారులకు అప్పగించే ప్రతిపాదన దుర్మార్గమన్నారు. బ్యాంకు ఉద్యోగులు, అధికారుల ప్రధాన డిమాండ్లు అందరికి సమానమైన పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ అమలు, ఐదు రోజుల బ్యాంకింగ్ వారం, ఐడిబిఐ బ్యాంక్ డిజిన్వెస్ట్‌మెంట్‌ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశ వ్యాప్తంగా పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.








కామెంట్‌లు (0)