- ఐద్వా జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.కె.శ్రీమతి, కనినిక ఘోష్
- రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు బలమైన ప్రజా ఉద్యమం : సుభాషిణి అలీ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : బిజెపి, ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తున్న మనువాద భావజాలానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం, ప్రత్యామ్నాయ కార్యక్రమాలు నిర్వహించాలని ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించినట్లు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.కె.శ్రీమతి, కనినిక ఘోష్ తెలిపారు. శుక్రవారం ఆటోనగర్లోని క్రాంతి రెసిడెన్సీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఐద్వా జాతీయ నాయకులు సుభాషిణి అలీ, తపశ్వి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు శ్రీదేవి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనినిక ఘోష్ మాట్లాడుతూ ఈ సమావేశాల్లో దేశంలో మహిళలు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. సమానత్వం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలను సంఘటితం చేస్తామని పేర్కొన్నారు. డీ లిమిటేషన్ తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్‌ను వెంటనే అమలు చేయాలని కోరారు. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెట్టకుండా అమలు చేసే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని కాపాడుకోవడం కోసం ఐద్వా ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ముఖ్యంగా మహిళల జీవనోపాధి, డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వీటిని ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని కోరారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) పేరుతో దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున ఓటర్లను తొలగిస్తున్నారని, దీనిపై ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. స్వతంత్రంగా పనిచేయాల్సిన ఎన్నికల సంఘాన్ని కేంద్రం తన చెప్పుచేతల్లో పెట్టుకుంటోందని విమర్శించారు. కేంద్రం తీరునూ ప్రచార కార్యక్రమంలో ప్రశ్నిస్తామని పేర్కొన్నారు. పికె.శ్రీమతి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అనుసరిస్తున్న విధానాల ఫలితంగా మహిళలకూ రక్షణలేని పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో మహిళలపై దాడులు యథేచ్ఛగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని, వాటి భారం సామాన్య కుటుంబాలపై ఎక్కువ పడుతోందని అన్నారు. అదే విధంగా బిజెపి అనుసరిస్తున్న మనువాద సిద్ధాంతం అభివృద్ధి నిరోధక విధానమని తెలిపారు. ఈ నేపథ్యంలో దానికి భావజాలానికి వ్యతిరేకంగా పోరాడతామని తెలిపారు. పెరిగిన ధరలను అదుపులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఐద్వా జాతీయ నాయకులు సుభాషిణి ఆలీ మాట్లాడుతూ మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారి సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వాలు పని చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా, స్త్రీ శక్తి వంటి పథకాలు అమలు చేస్తున్నా మహిళలకు అవసరమైన విధంగా అవి ఉపయోగపడటం లేదని తెలిపారు. మహిళల సమస్యలతో పాటు ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వి.సావిత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్, నిత్యావసర ధరలు పెరిగాయని, ప్రజా రవాణా వ్యవస్థను కుదిస్తున్నారని ఈ నేపథ్యంలో ఐద్వా ఆధ్వర్యాన ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామని తెలిపారు.








కామెంట్‌లు (0)