సిఐటియు, ఎపి రైతు సంఘం, కౌలు రైతుల సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పేదల హక్కులను కాలరాసే విబి గ్రామ్ జి పథకాన్ని రద్దుచేసి, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వచ్చే నెల 1న దేశవ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమంలో వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు, సన్న, చిన్న కారు రైతులు, అసంఘటితరంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సిఐటియు, ఎపి రైతు సంఘం, కౌలు రైతుల సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర కమిటీలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. 2005లో అమలులోకి వచ్చిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వల్ల దేశంలో సుమారు ఐదు కోట్ల మంది గ్రామీణ పేద కుటుంబాలు లబ్ధి పొందాయి. లక్షలాది ఎకరాల పేదల భూములు అభివృద్ధి అయ్యాయని ఆయా సంఘాల ప్రధాన కార్యదర్శులు ఎ.వి నాగేశ్వరరావు, కె.ప్రభాకర్ రెడ్డి, ఎం.హరిబాబు, కె.లోకనాథంలు శుక్రవారం సంయుక్తంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకంతో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరికాయని, పేదలు వలసలు తగ్గాయని, స్త్రీ,పురుషులకు సమాన వేతనాలు వృద్ధులు, ఒంటరి మహిళలు వికలాంగులకు సైతం చేయూతనిచ్చిందన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి చట్టాన్ని రద్దుచేసి పేదలకు ఎటువంటి హక్కులు లేకుండా ప్రభుత్వ దయాదాక్షిణంతో భూస్వాములు, కార్పొరేట్లకు వత్తిడికి పేదలకు గ్యారెంటీగా ఉన్న హక్కును ఎన్డీఏ ప్రభుత్వం కాల రాసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 90 నుండి 60 శాతానికి తమ వాటాను తగ్గించుకొని, రాష్ట్ర ప్రభుత్వాలపై 40 శాతం భారాన్ని మోపుతూ చట్టాన్ని మార్పు చేసిందని తెలిపారు. ఏడాదిలో 60 రోజులు పని ఇవ్వకుండా హక్కులను హరించిందని, స్థానిక సంస్థలకు ఎటువంటి అధికారాలు లేకుండా చేసిందన్నారు. 2005లో రాష్ట్రంలో ఈ చట్టాన్ని అనంతపురం జిల్లాలో ప్రారంభిస్తే 2026లో అదే చట్టానికి మంగళం పాడుతూ తిరుపతి జిల్లాలో విబి గ్రామ్ జి చట్టాన్ని ప్రారంభించడం కోట్లాదిమంది పేద ప్రజల అవమానించడమేనన్నారు.








కామెంట్‌లు (0)