బుధవారం, 22 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిమాన ప్రయాణాలు 12 శాతం పతనం

1 రోజు క్రితం

flight
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 10:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : దేశీయ విమానయాన రంగంలో జూన్ నెలలో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. మే నెలతో పోలిస్తే దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య దాదాపు 12 శాతం క్షీణించి 1.35 కోట్లకు పరిమితమయినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) వెల్లడించింది. మేలో ఈ సంఖ్య 1.53 కోట్లుగా ఉండగా.. గత ఏడాది జూన్‌లో 1.36 కోట్లుగా నమోదయ్యింది. జూన్-ఆగస్టు నెలలు సాధారణంగా విమానయాన రంగంలో లీన్ సీజన్ కావడంతో పాటు, పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో ఇంధన ధరలు పెరగడం కూడా ఈ తగ్గుదలకు కారణమైనట్లు డిజిసిఎ పేర్కొంది. అయితే ప్రస్తుత ఏడాది జనవరి-జూన్ మధ్య దేశీయ విమానయాన సంస్థలు మొత్తం 8.64 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 1.44 శాతం పెరుగుదలగా నమోదయ్యింది.

మార్కెట్ వాటా పరంగా ఇండిగో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. మేలో 64.9 శాతంగా ఉన్న మార్కెట్ వాటా జూన్‌లో 66.3 శాతానికి పెరగగా, ఎయిరిండియా గ్రూప్ వాటా 25.6 శాతం నుంచి 23.9 శాతానికి తగ్గింది. ఆకాశ ఎయిర్‌ వాటా 5.8 శాతం నుంచి 6.4 శాతానికి పెరగగా, స్పైస్‌జెట్ మార్కెట్ వాటా 2.5 శాతం నుంచి 1.9 శాతానికి పడిపోయింది. ఇంధన వ్యయాల పెరుగుదల, కార్యకలాపాలపై ఒత్తిడి నేపథ్యంలో ప్రధాన సంస్థల మధ్య మార్కెట్ వాటాలో మార్పులు చోటుచేసుకున్నాయి. సేవల నాణ్యతలో మాత్రం 89.4 శాతం ఆన్ టైమ్ ప్రగతితో ఇండిగో అగ్రస్థానంలో నిలిచింది. ఎయిర్ ఇండియా గ్రూప్ (85.9 శాతం), ఆకాశ ఎయిర్ (82.7 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. జూన్‌లో దేశీయ విమానాల రద్దు రేటు 0.63 శాతంగా నమోదైంది. విమానాల రద్దు, ఆలస్యం, బోర్డింగ్ నిరాకరణ కారణంగా ప్రభావితమైన ప్రయాణికులకు పరిహారం, సౌకర్యాల కల్పన కోసం విమానయాన సంస్థలు రూ.4 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు డిజిసిఎ వెల్లడించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్