- గోడకూలి శెట్టూరు ఎస్‌సి హాస్టల్లో విద్యార్థి మృతి
- మరో విద్యార్థికి గాయాలు
- హాస్టల్‌లో లేని టాయిలెట్ సౌకర్యం
- బహిర్భూమికి బయటకు వెళ్లడంతో ప్రమాదం
ప్రజాశక్తి - కల్యాణదుర్గం టౌన్ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా శెట్టూరు మండలంలోని ఎస్‌సి హాస్టల్‌లో విషాధ ఘటన చోటు చేసుకుంది. హాస్టల్‌కు చెందిన విద్యార్థులు ఇద్దరు బహిర్భూమి కోసం పాడుబడ్డ భవనంలోకి వెళ్లారు. అక్కడ గోడ కూలి ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. తోటి విద్యార్థుల కథనం ప్రకారం... శెట్టూరు మండల కేంద్రంలోని ఎస్‌సి హాస్టల్‌లో 134 మంది విద్యార్థులున్నారు. ఇందులో హర్షవర్ధన్ తేజ (14) ఏడో తరగతి చదువుతున్నాడు. హాస్టల్లో టాయిలెట్ సౌకర్యం లేకపోవడంతో హర్షవర్థన్, మరో విద్యార్థి అక్షయ్ ఆదివారం సాయంత్రం బహర్భూమికి వెళ్లేందుకు సమీపంలోని పాతబడిన భవనం వద్దకు వెళ్లారు. ఈ సమయంలో పాతగోడ కూలి విద్యార్థులపై పడటంతో హర్షవర్ధన్ తేజ తీవ్ర గాయాలతో అపస్మారస్థితిలోకి వెళ్లారు. మరో విద్యార్థి అక్షయ్‌కు కుడికాలు విరిగింది. తోటి విద్యార్థులు గమనించి హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గాయపడ్డ విద్యార్థులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం కల్యాణదుర్గం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ హర్షవర్ధన్ తేజ మరణించారు. గాయపడిన అక్షయ్‌ను మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. హర్షవర్ధన్ తల్లిదండ్రులు హేమావతి, ప్రభాకర్ ఆర్తనాదాలు అందర్నీ కలిచివేశాయి. విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్‌సి, ఎస్‌టి జెఎసి నాయకులు డిమాండ్ చేశారు.
ఎస్‌సి హాస్టల్లో మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడమే విద్యార్థి మృతికి కారణం
శెట్టూరు ఎస్‌సి బాలుర వసతి గృహంలో టాయిలెట్ సౌకర్యాలు లేవు. ఇతర కనీస సౌకర్యాలు కూడా ఏమాత్రమూ లేవు. కొన్నేళ్లుగా విద్యార్థులు బహుర్భూమి కోసం సమీపంలోని పాటుపడ్డ భవనాలు, కంపచెట్లలోకి వెళ్తున్నారు. రెండు సంవత్సరాలుగా వసతి గృహానికి సంబంధించిన టాయిలెట్స్ నిర్మాణాలు జరుగుతున్నా ఇంతవరకు వినియోగంలోకి తీసుకురాకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం.
ఎమ్మెల్యే అమిలినేని పరామర్శ
విషయం తెలుసుకున్న కల్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని హర్షవర్ధన్ తేజ తల్లిదండ్రులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.








కామెంట్‌లు (0)