- గోదావరి డెల్టా ఆధునీకరణకు చర్యలు
- మంత్రి నిమ్మల రామానాయుడు
రాజమహేంద్రవరం : గోదావరి డెల్టాకు జీవనాడిగా నిలిచిన ధవళేశ్వరం బ్యారేజ్‌లో మిగిలిన 117 గేట్ల మార్పిడికి రూ.150.09 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళవారం ధవళేశ్వరం బ్యారేజ్‌ను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీటిని అందిస్తున్న ధవళేశ్వరం బ్యారేజ్ రాష్ట్ర వ్యవసాయానికి కీలకమని మంత్రి పేర్కొన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో బ్యారేజ్ నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆయన విమర్శించారు. కేంద్ర జల సంఘం (సిడబ్ల్యూసి) బ్యారేజ్ భద్రతపై హెచ్చరికలు చేసినప్పటికీ అప్పటి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రూ.31.77 కోట్లతో మొత్తం 175 గేట్లలో 58 గేట్లను మార్చినట్లు తెలిపారు. ప్రస్తుతం మిగిలిన 117 గేట్ల మార్పిడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.150.09 కోట్లను మంజూరు చేశారని చెప్పారు. గోదావరి డెల్టా సమగ్ర ఆధునీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, డిపిఆర్ తయారీకి రూ.13.4 కోట్లను కేటాయించి లైడార్ సర్వేను పూర్తి చేసినట్లు వెల్లడించారు. డిపిఆర్ సిద్ధమైన వెంటనే ఆధునీకరణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల పునర్నిర్మాణ పనులను ఈ వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.








కామెంట్‌లు (0)