పల్లె రుచుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన తాడిపండు, తియ్యని రుచితో పాటు పోషకాలనూ అందించే ప్రకృతి పండు. విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థం వంటి పోషకాలు సమృద్ధిగా ఉండే ఈ పండు శరీరానికి శక్తినిచ్చి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. తాడిపండుతో హల్వా, పాయసం, ఇడ్లీ, రొట్టె, జామ్, కేక్ వంటి ఎన్నో రకాల రుచికరమైన వంటకాలను తయారుచేసుకోవచ్చు. గ్రామాల్లో ఆహార సంస్కృతిలో విశిష్ట స్థానం సంపాదించుకున్న ఈ పండు ఆరోగ్యానికీ, రుచికీ ఎంతో మేలు చేస్తుంది. మరి ఈ పండుతో రుచికరమైన వంటకాలు ఎలా చేయాలో తెలుసుకుందాం.
ఇడ్లీ
కావాల్సినవి : పండిన తాటిపండు గుజ్జు – కప్పు, ఇడ్లీరవ్వ – 2 కప్పులు, బెల్లంతురుము – ¾ కప్పు, తురిమిన కొబ్బరి – ¼ కప్పు, యాలకులపొడి – ½ స్పూను, నెయ్యి – స్పూను, జీడిపప్పు, కిస్మిస్ – కొద్దిగా, ఉప్పు – చిటికెడు, నీరు – అవసరమైనంత.
తయారీ : ఒక గిన్నెలోకి తాటిపండు గుజ్జు వేసి, అందులో బెల్లం తురుము వేసి బాగా కలపాలి. అందులో ఇడ్లీ రవ్వ, కొబ్బరి తురుము, యాలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీరు జోడించి ఇడ్లీ పిండిలా చిక్కగా కలపాలి. దీన్ని 15–20 నిమిషాలు నాననివ్వాలి. దీనిలో నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ కలపాలి. ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాసి పిండిని పోసి, ఆవిరిపై 12–15 నిమిషాలు ఉడికించాలి. వేడివేడిగా తీసి కొద్దిగా నెయ్యి పోసి, కొబ్బరి పచ్చడి, టమాటపచ్చడితో వడ్డిస్తే తియ్యగా, మెత్తగా ఉండే తాటిపండు ఇడ్లీ రెడీ.

రొట్టె
కావాల్సినవి: తాటిపండు గుజ్జు – కప్పు, బియ్యప్పిండి – 2 కప్పులు, బెల్లంతురుము – కప్పు, తురిమిన కొబ్బరి – ½ కప్పు, యాలకుల పొడి – ½ స్పూను, నూనె – అవసరమైనంత, జీడిపప్పు ముక్కలు – 2 స్పూన్లు, ఉప్పు-చిటికెడు.
తయారీ : ఒక గిన్నెలోకి తాటిపండు గుజ్జు వేసి, అందులో బెల్లం తురుము వేసి, పూర్తిగా కరిగేలా కలపాలి. ఇందులో బియ్యప్పిండి, కొబ్బరి తురుము, యాలకుల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీరు కలిపి, చపాతీ పిండికంటే కొద్దిగా మెత్తగా ఉండే ముద్దలా చేసుకోవాలి. 15–20 నిమిషాలు మూతపెట్టి ఉంచాలి. అరటిఆకుపై కొద్దిగా నెయ్యి రాసి, పిండిని చేత్తో గుండ్రంగా రొట్టెలా ఒత్తాలి. వేడిచేసిన పెనం మీద కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి, రొట్టెను రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకూ మోస్తరు మంటపై కాల్చాలి. వేడివేడిగా నెయ్యి పోసుకొని తింటే తాటిపండు రొట్టె ఎంతో రుచిగా ఉంటుంది.

పాయసం
కావాల్సినవి : పండిన తాటిపండు గుజ్జు – కప్పు, పాలు – ½ లీటర్, బెల్లం తురుము – ¾ కప్పు, సగ్గుబియ్యం – ¼ కప్పు, యాలకుల పొడి – ½ స్పూన్, జీడిపప్పు – 10, కిస్మిస్ – 10, నెయ్యి – 2 స్పూన్లు.
తయారీ : ముందుగా సగ్గుబియ్యాన్ని 20–30 నిమిషాలు నానబెట్టాలి. వెడల్పాటి గిన్నెలోకి పాలను మరిగించి అందులో సగ్గుబియ్యం వేసి మెత్తగా ఉడికించాలి. బెల్లాన్ని కొద్దిగా నీటిలో కరిగించి వడకట్టి, ఉడికిన మిశ్రమంలో కలపాలి. తాటిపండు గుజ్జు వేసి, తక్కువ మంటపై 5–7 నిమిషాలు కలుపుతూ ఉడికించాలి. వెంటనే యాలకుల పొడి వేసి కలపాలి. తర్వాత నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్ వేయించి, పాయసంలో కలిపి దింపాలి. అంతే తాడిపండు పాయసం రెడీ. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.
చిట్కా: తాటిపండు గుజ్జు వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించకుండా తక్కువ మంటపై మాత్రమే ఉడికిస్తే సహజమైన రుచి, సువాసన ఉంటాయి.

బూరెలు
కావాల్సినవి: తాటిపండు గుజ్జు - కప్పు, బియ్యంపిండి - కప్పు, బెల్లం - పావుకప్పు, యాలకుల పొడి-చెంచా, కొబ్బరితురుము (ఎండు లేదా పచ్చికొబ్బరి) - పావుకప్పు, నూనె - తగినంత.
తయారీ: ఒక పాత్రలో తాటిపండు గుజ్జు, బియ్యం పిండి, బెల్లం, యాలకుల పొడి, కొబ్బరి తురుము, వేసి జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలిపి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో నూనె పోసి వేడయ్యాక చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో బంగారు రంగు వచ్చేవరకూ వేయించుకుంటే సరి. ఇదే విధానంలో గారెలు మాదిరిగానూ చేయొచ్చు. ఆ మిశ్రమాన్ని చిన్న అరిటాకు మీద వేసి గారెల్లా వత్తుకుని నూనెలో వేయిస్తే తాటి గారెలు సిద్ధమవుతాయి. ఇవే కాదు, ఇలా తాటి గుజ్జుతో ఇడ్లీ, రొట్టెలు, కుడుములు కూడా చేసుకోవచ్చు.








కామెంట్‌లు (0)