సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉద్దానం సికెడిపై నీతి ఆయోగ్ దృష్టి

1 గంట క్రితం

kidney
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 07:44 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- కిడ్నీ బాధితులను కలిసిన త్రిసభ్య కమిటీ

- వైద్య సేవలు, వ్యాధి కారణాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం

- 'ప్రజాశక్తి' కథనానికి స్పందన

ప్రజాశక్తి- కవిటి, పలాస, సోంపేట (శ్రీకాకుళం జిల్లా) : శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (సికెడి) పరిస్థితులపై నీతి ఆయోగ్ దృష్టి సారించింది. 'విలపిస్తున్న ఉద్దానం' శీర్షికన ఈనెల 20న 'ప్రజాశక్తి`లో వచ్చిన కథనం మినిస్ట్రీ ఆఫ్ యూనియన్ హెల్త్ సెక్రటరీ పుణ్య శైల శ్రీవాత్సవ, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, కమిషనర్ హెల్త్ వీరపాండ్యన్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పద్మ శశిధర్, రీజనల్ డైరెక్టర్ మీనాక్షికి సామాజిక మాధ్యమాల ద్వారా చేరింది. దీంతో, వ్యాధి మూలాలను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఎం.శ్రీనివాస్ నేతృత్వంలోని త్రిసభ్య నిపుణుల కమిటీ కవిటి మండలం బల్లిపుట్టుగ గ్రామంలో ఆదివారం పర్యటించింది. నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి, అసోసియేట్ డీన్ డాక్టర్ డి.శ్రీభూషణ్ రాజు, ఎయిమ్స్ న్యూఢిల్లీ నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ డి.ఎం భూమిక ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరు గ్రామంలోని కిడ్నీ బాధితులు జయసేన బిసాయి, సరస్వతి బిసాయి, ఎర్ర బృందావన్ ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. వారికి అందుతున్న వైద్య సేవలు, చికిత్సలో ఎదురవుతున్న ఇబ్బందులు, జీవన పరిస్థితులు, వ్యాధి బారిన పడడానికి కారణాలపై బాధితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఉద్దానంలో సికెడి వ్యాప్తి, బాధితుల పరిస్థితులు, ప్రభుత్వం అమలు చేస్తున్న వైద్య సేవలు, ప్రత్యేక చర్యలను కమిటీకి వివరించారు. స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని శాశ్వత పరిష్కార చర్యలు అవసరమని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు గతంలో కవిటి మండలంలో 24 వేల మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 4,900 మందికి వ్యాధి లక్షణాలు కనిపించిన విషయం తెలుసుకున్న కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత సిబ్బంది ద్వారా ఇచ్ఛాపురం నియోజకవర్గం మండలాల వారీ సమాచారం తీసుకున్నారు. పర్యటనలో జాయింట్ కలెక్టర్ ఫర్హాన్ అహ్మద్ ఖాన్, ఆర్డిఒ ఆర్.అప్పలరాజు, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ విజయలక్ష్మి, ఇన్‌ఛార్జి డిఎం అండ్ హెచ్ఒ టి.శ్రీకాంత్, కెజిహెచ్‌ వైద్యులు జి.ప్రసాద్, శరత్ జ్యోత్స్న పలాస కిడ్నీ ఆస్పత్రి ఇన్‌ఛార్జి డాక్టర్ వూడి సంతోష్, డిపిఎంఒ డాక్టర్ బి.వీంద్ర, తహశీల్దార్ కళ్యాణ చక్రవర్తి పాల్గొన్నారు.

పలాస కిడ్నీ ఆస్ప్రతి సందర్శన

పలాస కిడ్నీ పరిశోధనా కేంద్రం, ఆస్ప్రతిని నీతి ఆయోగ్ బృందం సందర్శించింది. అనంతరం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రి నిర్మించిన నుంచి ఇప్పటివరకు వచ్చిన కేసులు, ఎంతమంది వ్యాధి నుంచి బయటపడ్డారు, ఎంత మంది మృతి చెందారన్న వివరాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆస్ప్రతిలో అందిస్తున్న సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఆస్ప్రతికి వచ్చే ప్రతి రోగి కోలుకొని ఇంటికి వెళ్లే విధంగా వైద్యం అందించాలని సూచించారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్ని వ్యాధుల నివారణ, చికిత్స, పరిశోధనలను మరింత విస్తృతం చేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ ఇప్పటికే కిడ్నీ ఆస్ప్రతికి గ్లో సంస్థ ద్వారా డయాలసిస్ యూనిట్లు అందించామని, అవసరమైతే అదనంగా యూనిట్లు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

కిడ్నీ వ్యాధిపై క్షేత్రస్థాయి పరిశీలన

సోంపేట ఆస్పత్రిని సందర్శిన నీతి ఆయోగ్ సభ్యులు ఆస్ప్రతి సూపరింటెండెంట్ టి.వెంకటేష్, వైద్యులు జోగినాయుడు, మంచు ప్రదీప్‌తో మాట్లాడారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించేందుకు అవసరమైన ప్రయోగశాల పరీక్షలను మెరుగుపరచడం, ఆధునిక పరికరాలతో డయాలసిస్ కేంద్రాలను అభివృద్ధి చేయడం, ప్రతి రోగికి నాణ్యమైన మూత్రపిండ చికిత్స అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి మూల కారణాలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి జీనోమ్ విశ్లేషణ వంటి ఆధునిక పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సమావేశంలో వచ్చిన సూచనలు, సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ స్థాయి సంస్థల దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన సహకారం, సాంకేతిక మద్దతు, తదుపరి కార్యాచరణ కోసం రాష్ట్ర, జాతీయ బృందాలతో సమన్వయం చేస్తామన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్