ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
న్యూఢిల్లీ : నీట్ నిరసనల్లో పాల్గొన్న వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు వుండబోవని ఢిల్లీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నేరపూరితమైన చరిత్ర కలిగిన వారికి ఈ మినహాయింపులు వర్తించబోవని పేర్కొంది. నిరసనల్లో పాల్గొన్న వారిపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దంటూ పోలీసులను ఆదేశించింది. ఇప్పటికే అరెస్టులు జరిగిన కేసుల్లో అరెస్టులు/నిర్బంధాలను సమీక్షించే, వారిని విడుదల చేసే ప్రక్రియ త్వరితగతిన జరుగుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆందోళనల్లో పాల్గొన్న వారిపై తదుపరి ఎలాంటి ప్రతికూల చర్యలు చేపట్టబోమని కూడా ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ విషయం ఇంతటితో ముగిసినట్లే భావిస్తామని పేర్కొంది. నిరసనలకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై దర్యాప్తు కొనసాగించేందుకు రాష్ట్ర అధికారులను అనుమతిస్తూ, ప్రదర్శనలు, ఆందోళనలకు సంబంధించి అరెస్టయిన మైనర్లందరినీ తక్షణమే విడుదల చేయాలని సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశించింది. ఢిల్లీలో, పలు రాష్ట్రాల్లో విద్యార్ధుల నిరసనల సమయాల్లో పోలీసులు అతిగా వ్యవహరించారన్న ఆరోపణలపై కూలంకషంగా, స్వేచ్ఛగా, సక్రమంగా విచారణ నిర్వహించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలిస్తామని కూడా సుప్రీం తెలిపింది. దీనిపై ముందుగా కేంద్రం, ఆయా రాష్ట్రాలు స్పందనలు తెలియజేయాలని కోరింది. వాటి ఆధారంగా స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలో వద్దో నిర్ణయిస్తామని బెంచ్ తెలిపింది.







కామెంట్‌లు (0)