సిజెపి వ్యవస్థాపకుడు *అభిజిత్ దీప్కే డిమాండ్
అణచివేత చర్యలకు ఆదేశాలిచ్చింది ఆయనేనని వ్యాఖ్యలు
పోలీసులు రాజ్యాంగాన్ని అనుసరించాలి
ఛత్రపతి శంభాజీ నగర్ : ఇటీవల జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న విద్యార్ధులపై అణచివేత చర్యలకు పోలీసులను ఆదేశించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని సిజెపి వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషిని నియమించడాన్ని కూడా ఆయన విమర్శించారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్ధులు జరిపిన ఆందోళన హక్కుల కోసం వారు జరిపిన పోరాటంగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రైతాంగ ఉద్యమాలకు దీప్కే మద్దతు ప్రకటించారు. నీట్ పేపర్ లీక్‌పై నెల రోజులుగా సిజెపి సాగించిన ఆందోళనల అనంతరం ఛత్రపతి శంభాజీనగర్‌లోని తన నివాసానికి తిరిగివచ్చిన దీప్కే విలేకర్లతో మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో వ్యవస్థలు కూడా విఫలమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన డిమాండ్‌కు మద్దతిచ్చారు. విద్యార్ధులపై పోలీసుల చర్యకు ఆదేశాలు జారీ చేయగలిగింది అమిత్ షానే, మరెవరు చేయగలరని అన్నారు. ‘‘అమిత్ షా కచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. మరొక విషయం కూడా వినబడుతోంది. కాక్రోచ్ జనతా పార్టీకి బయట నుండి నిధులు అందుతున్నాయని లేదా బయట నుండి ఆ ఉద్యమాన్ని నడుపుతున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఒకవేళ అదే గనుక జరిగితే, అమిత్ షా వంటి వ్యక్తి వైఫల్యమే అవుతుంది. సిజెపిని బయటనుండి నడుపుతున్నట్లైతే ఇక ఆయన ఏ తరహా చాణక్యుడు అవుతారు?’’ అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలంతా ఏకతాటిపైకి రావాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడడమనేది కేవలం ప్రతిపక్షాలకు సంబంధించిన అంశమే కాదని, ఇప్పడు. దాన్ని కాపాడేందుకు దేశ ప్రజలు ఒక్క తాటిపైకి రావాలని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రస్తావిస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని ఉపయోగిస్తున్నారని అన్నారు. ‘‘న్యాయ వ్యవస్థపై కూడా ఒక ప్రశ్నార్థకం వుంది. శివసేన, ఎన్‌సిపి వంటి పార్టీలను చీల్చడానికి ఇడి, సిబిఐలను ఎలా ఉపయోగించారో మనందరం చూశాం. దీన్ని నిలువరించడానికి కేవలం ప్రతిపక్షాలే కాదు, మొత్తంగా దేశ ప్రజలందరూ ఒక తాటిపైకి రావాలి.’’ అని అన్నారు.
‘‘దేశ విద్యా శాఖ మంత్రి రేపిస్ట్‌లను సమర్ధిస్తున్నట్లైతే ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించి ఆ స్థానంలో మరో వింత మనిషిని కూర్చోబెట్టినట్లే అర్ధం. దేశానికి ఏ రకమైన సందేశం ఇస్తున్నారు? వారి పార్టీ అంతా గూండాలే కాబట్టి వారు కూడా ఇంకేమీ చేయలేరు. రామ్ రహీమ్ (అత్యాచార నేరస్తుడు) వంటి వ్యక్తులు వారి హయాంలోనే పెరోల్‌పై బయటకు వచ్చారు. గూండాలకు, రేపిస్ట్‌లకు ఈ ప్రభుత్వం మద్దతిస్తోంది.’’ అని విమర్శించారు.
జంతర్ మంతర్ వద్ద నిరసనల ద్వారా దేశ సంస్కృతిని జెన్ జెడ్ అపఖ్యాతి పాల్జేశారని యోగా గురు రామ్‌దేవ్ చేసిన విమర్శపై స్పందిస్తూ రాజ్యాంగ పరిధిలోనే ఆ ఆందోళన సాగిందని స్పష్టం చేశారు. పతంజలి గురించి రామ్‌దేవ్ ఆలోచిస్తే మంచిదని వ్యాఖ్యానించారు.
రైతాంగ పోరాటాలకు అండగా ఉంటాం
రైతాంగ పోరాటాలకు మద్దతును ప్రకటించారు. అవసరమైనపుడు వారికి సిజెపి అండగా నిలబడుతుందన్నారు. గతంలో తమ ఆందోళనలకు వారు మద్దతిచ్చారని, ఒకవేళ వారికి ఇప్పడు తమ మద్దతు అవసరమైతే కచ్చితంగా అండగా నిలబడతామని చెప్పారు. ఈ దేశంలో పోలీసులు రాజ్యాంగాన్ని అనుసరించాలని, అంతేకానీ రాజకీయ ఆదేశాలను కాదని వ్యాఖ్యానించారు. వారు ఒక పార్టీకి చెందినవారు కాదని, దేశానికి చెందినవారని అన్నారు.







కామెంట్‌లు (0)