ఢిల్లీ పోలీసులకు ఎదురుదెబ్బ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని, విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ సాగిన ఉద్యమ కీలక నాయకుల్లో ఒకరైన ఎస్ఎఫ్ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి, జెఎన్ యు ఎస్ యు మాజీ అధ్యక్షురాలు ఐషీ ఘోష్‌పై ఉన్న అరెస్ట్ వారెంట్‌ను ఢిల్లీ పాటియాలా కోర్టు రద్దు చేసింది. 2021లో ఢిల్లీలోని పశ్చిమ బెంగాల్ (బంగ) భవన్ వద్ద ఆందోళన కేసులో జారీ చేసిన వారెంట్‌ను ఉపయోగించి ఐషీఘోష్ ని వేటాడేందుకు సాహసించిన ఢిల్లీ పోలీసులకు ఈ తీర్పు పెద్ద ఎదురుదెబ్బ. అరెస్టు వారెంట్‌ను రద్దు చేస్తున్నట్లు జడ్జి విజయశ్రీ రాథోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను స్వీకరించాలా? వద్దా? అనే దానిపై విచారణ నవంబర్ 21న ప్రారంభమవుతుందని కోర్టు పేర్కొంది. ఐషీఘోష్ కోర్టుకు గురువారం హాజరయ్యారు. పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు హాజరు కాలేదు. అరెస్టు చేసేందుకు పోలీసుల అత్యుత్సాహంపై ప్రశ్నించవచ్చనే ఉద్దేశంతో విచారణకు దూరంగా ఉన్నారని అనుకుంటున్నారు. 2021లో డివైఎఫ్ఐ కార్యకర్త హత్య అనంతర ఆందోళనల్లో ఐషీ ఘోష్ పాత్రను నిరూపించే ఆధారాలు ఉంటే ఇవ్వాలని న్యాయస్థానం అప్పట్లో పోలీసులను ఆదేశించింది. గురువారం ఈ కేసును విచారణకు స్వీకరించినప్పుడు, ఆందోళనకు సంబంధించిన సిసిటివి ఫుటేజీని ఒక సీడీలో అప్పగించాల్సి ఉండగా, పోలీసులు అందజేయలేదు. బుధవారమే వారెంట్‌పై స్టే విధించిన కోర్టు, మరుసటి రోజే దానిని రద్దు చేసింది. విద్యార్థి నాయకుల చిత్రాలతో ఆర్ఎస్ఎస్ పత్రిక ఒక కథనం ప్రచురించిన అనంతరం ఐషీఘోష్ ని అరెస్టు చేసేందుకు సిపిఎం కేంద్ర కార్యాలయానికి సివిల్ డ్రెస్‌లో ఉన్న ఢిల్లీ పోలీసులు ప్రయత్నించగా, ఆ కుట్రలను సిపిఎం అడ్డుకున్న సంగతి తెలిసిందే.







కామెంట్‌లు (0)