గురువారం, 30 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకార్మిక చట్టాల అమలు, కనీస వేతనాల సాధన కోసం కదంతొక్కిన కార్మికులు

1 గంట క్రితం

ptpmaha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 30, 2026, 11:57 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అరెస్టులు

  • సిఐటియు ఆధ్వర్యంలో రాష్ర్టవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నా

ప్రజాశక్తి - యంత్రాంగం : కార్మిక చట్టాల అమలు, కనీస వేతనాల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు కదం తొక్కారు. ఎనిమిది గంటల పనిదినం, ఉద్యోగ భద్రత కోసం నినదించారు, సిఐటియు ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన మహా ప్రదర్శనలను పలు జిల్లాల్లో పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాల్లో పలువురు నేతలను అరెస్టు చేశారు. అయినా కార్మికులు వెనకడుగు వేయలేదు.

శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో వివిధ ప్రజా సంఘాల కార్మికులు, కాంట్రాక్టు, అవుట్‌‌సోర్సింగ్‌ ఉద్యోగులు కలెక్టరేట్‌ ‌వద్ద చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరిన సిఐటియు నాయకులు, కార్మికులను పోలీసులు పట్టణంలోని గణేష్‌ సర్కిల్ వద్ద అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసుల వలయాన్ని చేధించుకుని కలెక్టర్ కార్యాలయానికి కార్మికులు దూసుకు వెళ్లేందకు ప్రయత్నించగా ఆర్ టిసి డిపో వద్దకు మరోసారి అడ్డుకున్నారు. మహిళలు, నాయకులను బలవంతంగా లాగేశారు. రాష్ట్ర సిఐటియు ఉపాధ్యక్షులు జి.ఓబులు, జిల్లా శ్రామిక మహిళ కన్వీనర్ దిల్షాద్, బి.గౌస్ లాజంను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అయినా, కార్మికులు కలెక్టరేట్‌‌కు చేరుకుని అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసే వరకు కదిలేది లేదంటూ భీష్మించారు. ఆందోళనకు తలొగ్గిన పోలీసులు అరెస్టు చేసిన నాయకులను విడుదల చేసి కలెక్టరేట్‌ ‌వద్దకు తీసుకొచ్చారు. అనంతరం నాయకులు కార్మికులతో కలిసి కలెక్టరేట్‌ ‌వద్ద ధర్నాను కొనసాగించారు. అనంతరం ఆర్ డిఒ కొండయ్యకు వినతిపత్రం అందజేశారు. ​అనంతపురం కార్పొరేషన్‌ కార్యాలయం నుంచి ‌ప్రధాన కూడళ్ల మీదుగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. తిరుపతిలో లెమన్ టీ హోటల్ వద్ద శాంతియుతంగా ర్యాలీ ప్రారంభించిన వెంటనే పోలీసులు రోప్ సాయంతో అడ్డుకున్నారు. దీంతో సిఐటియు నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో వందలాది మంది కార్మికులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జయచంద్ర చొక్కా చినిగిపోయింది. నాయకులను పోలీసులు ఈడ్చుకెళ్లారు. 30 మంది సిఐటియు నాయకులను అరెస్టు చేసి, తిరుచానూరు పోలీసు స్టేషన్ కు తరలించారు. సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. చిత్తూరు జిల్లాలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి, శ్రీకాకుళంలో పోలీసులు అడుగడుగునా బారీకేట్లు పెట్టి కార్మికులు అడ్డుకున్నారు. తుర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ ‌బిఆర్‌ ఆంబేద్కర్‌ ‌కోనసీమ, కడప, అన్నమయ్య,,ఒంగోలు, మార్కాపురం, కృష్ణా, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేశారు. పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరం కలెక్టరేట్‌ ‌వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. పల్నాడు జిల్లా నరసరావు పేటలో ధర్నా చౌక్‌ ‌వద్ద ఆందోళన నిర్వహించారు. నెల్లూరులో వి ఆర్‌ ‌కళాశాల మైదానం నుండి కలెక్టరేట్‌ ‌వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.

G--IMG-20260730-WA0015.jpg

​కనీస వేతనాలను పెంచండి : నేతల డిమాండ్‌

ఎన్‌‌టిఆర్‌ ‌జిల్లా కలెక్టరేట్‌ ‌వద్ద సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ.గత 15 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను సవరించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ కార్మికులను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. వెంటనే కనీస వేతనాల జిఓ లను సవరించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.విశాఖలో సరస్వతీ పార్క్ నుంచి జగదాంబ జంక్షన్ మీదుగా కలెక్టర్ ఆఫీస్ వరకూ భారీ ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న వారికి గడిచిన 20 సంవత్సరాలుగా కనీస వేతనాల సవరణ జరగలేదని, ఇంతకన్నా అన్యాయం మరొకటి ఉండదని అన్నారు. వైజాగ్‌ ‌స్టీల్‌ ‌ప్లాంట్‌‌లో, విశాఖ డెయిరీలో అక్రమంగా తొలగించిన కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో జోరు వానను సైతం లెక్కచేయకుండా కార్మికులు ర్యాలీ నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వందలాది మంది కార్మికులు పార్వతీపురం ఆర్ టిసి కాంప్లెక్స్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ… 71 రకాల షెడ్యూల్స్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలకు తక్కువ కాకుండా చెల్లించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రెండేళ్లకు ఒకసారి కనీస వేతనాలను సవరిస్తూ జీవోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుంటూరులో వెంకటేశ్వరా విజ్ఞాన మందిరం నుండి కలెక్టరేట్‌ ‌వరకూ వందలాది మందితో ర్యాలీ నిర్వహించారు. ధర్నానుద్దేశించి సిఐటియు రాష్ర్ట కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ర్ట ప్రభుత్వం పెట్టుబడిదారులకు అప్పనంగా రాయితీలిస్తూ, కార్మికులకు మాత్రం కనీస వేతనాలు అమలు చేయడం లేదని విమర్శించారు.

G--IMG-20260730-WA0063.jpg


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్