గురువారం, 30 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసేవల రంగం మందగింపు

1 గంట క్రితం

servicesectorr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 30, 2026, 11:51 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 20.8 నుండి 9.8 శాతానికి పడిపోయిన 19 సేవా రంగాల ఉమ్మడి ఉత్పత్తి

ప్రజాశక్తి-బిజినెస్‌ బ్యూరో : దేశంలో సేవల రంగం మందగించింది. ఈ ఏడాది మే నెలలో భారీగా తగ్గిందని కేంద్ర గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (ఎంఒఎస్‌‌పిఐ) విడుదల చేసిన సర్వీసెస్‌ ప్రొడక్షన్‌ ట్రయల్‌ ఇండెక్స్‌ (ఐఎస్‌‌పి) నివేదికలో వెల్లడయ్యింది. ఐఎస్‌‌పిలోని 19 సేవల రంగాల్లో రెండింటిని మినహాయించి మిగిలిన అన్ని రంగాల వృద్ధి మందగించినట్లు నివేదిక స్పష్టం చేసింది.

మంత్రిత్వ శాఖ మొత్తం వృద్ధి రేటును నేరుగా ప్రకటించనప్పటికీ.. ఆర్థిక వేత్తల అంచనాల ప్రకారం ఈ 19 సేవల రంగాల ఉమ్మడి ఉత్పత్తి వృద్ధి ఏప్రిల్‌లో నమోదైన 20.8 శాతం నుంచి మే నెలలో 9.8 శాతానికి పడిపోయింది. ​రిటైల్ ట్రేడ్, రోడ్డు రవాణా, ఐటి, అడ్మిన్ అండ్ సపోర్ట్ సర్వీసెస్ రంగాల్లో వృద్ధి మందగించడం వల్లే ఈ క్షీణత నమోదైందని కేర్ ఎడ్జ్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ రజనీ సిన్హా తెలిపారు. అయితే వసతి, ఆహార సేవలు, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ వంటి 8 రంగాల్లో మాత్రం రెండంకెల వృద్ధి నమోదై మొత్తానికి సేవల రంగానికి కొంత మద్దతుగా నిలిచాయని ఆమె పేర్కొన్నారు. ఏప్రిల్ నెలలో 14 రంగాలు రెండంకెల వృద్ధిని సాధించగా.. మే నెలలో కేవలం 8 రంగాలు మాత్రమే ఈ జాబితాలో నిలిచాయి. విభాగాల వారీగా పరిశీలిస్తే.. మే నెలలోనూ వసతి, ఆహార సేవల రంగం అత్యధికంగా 27.4 శాతం పెరుగుదల ముందువరుసలో నిలిచింది.

ఏప్రిల్‌లో ఇది 37.2 శాతంగా ఉంది. ఇక ఐఎస్‌‌పిలో అత్యధికంగా 22.5 శాతం వెయిటేజీ ఉన్న ఐటి, కంప్యూటర్ సంబంధిత సేవలు ఏప్రిల్‌లో 15.2 శాతం వృద్ధిని సాధించగా.. మే నెలలో 10.3 శాతానికి పరిమితమయ్యాయి. ఏప్రిల్‌లో 0.4 శాతం క్షీణించిన రైల్వే రవాణా మే నెలలో 3.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. పశ్చిమాసియాలో ఘర్షణలు, ఇంధన ధరల భారం కారణంగా విమానయాన రంగం వరుసగా రెండో నెల కూడా ప్రతికూల వృద్ధిని చవి చూసింది. ఈ రంగం ఏప్రిల్‌లో 13.9 శాతం క్షీణత చవి చూడగా.. మే నెలలో 2.8 శాతానికి పరిమితం చేసుకుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్