- విశాఖ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి : సిపిఎం
ప్రజాశక్తి -ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : తాత్కాలిక చర్యలు, ప్రచార ఆర్భాటాలు కాకుండా విశాఖపట్నం ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ రెండున పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి నీటిని తీసుకొచ్చి జలహారతి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంపై జగ్గునాయుడు స్పందించారు. సోమవారం పార్టీ విశాఖ జిల్లా కార్యాలయం ఏచూరి భవన్‌లో ఆర్.కె.ఎస్.వి. కుమార్, పి. మణి, బి.జగన్, వి.కృష్ణారావులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖలోని పలు ప్రాంతాలకు రెండు, మూడు రోజులకు ఒకసారి మాత్రమే నీరు సరఫరా అవుతోందని, కొన్నిచోట్ల అరగంటకు మించి నీరు రావడం లేదని తెలిపారు. ప్రస్తుతం నగరానికి 130 ఎంజిడిల నీరు అవసరం ఉండగా 103 ఎంజిడిలు మాత్రమే సరఫరా అవుతోందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు, ఎడమ కాలువ పనులు పూర్తి చేసి, విశాఖ అవసరాలకు కొత్త రిజర్వాయర్లు నిర్మించాలని కోరారు. విశాఖ ప్రజలకు, పరిశ్రమలకు నీటి సరఫరాను ప్రైవేటుపరం చేయొద్దని కోరారు. పోలవరం ప్రాజెక్టు పనులను గత శనివారం తమ పార్టీకి చెందిన 13 మంది ప్రతినిధుల బృందం పరిశీలించిందని జగ్గునాయుడు తెలిపారు. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యాం, 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం, ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్, కొన్ని టన్నెల్ పనులు ఇంకా పూర్తికాలేదన్నారు. ఇవి పూర్తి కావడానికి కనీసం మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని, ఈ పనులు పూర్తికాకుండా పోలవరం నుంచి ఎడమ కాలువ ద్వారా నీటిని సరఫరా చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా వస్తున్న 3,500 క్యూసెక్కుల నీటిలో 2,000 క్యూసెక్కులను ఎర్రవరం వద్ద పోలవరం ఎడమ కాలువలోకి విడుదల చేస్తున్నారని తెలిపారు. ఈ నీరు సుమారు 160 కిలోమీటర్లు ప్రయాణించి తాళ్లపాలెం వద్ద ఏలేరు కాలువలో కలుస్తుందన్నారు. కాలువ సామర్థ్యం 17,500 క్యూసెక్కులు కాగా ప్రస్తుతం కేవలం 2,000 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయని పేర్కొన్నారు. ఇంత తక్కువ నీటిని ఆధారంగా చేసుకుని డేటా సెంటర్లు, మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు నీరు సరఫరా చేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదన్నారు.
బచావత్ అవార్డు ప్రకారం విశాఖ నగర తాగునీరు, పరిశ్రమల అవసరాలకు 23 టిఎంసిల నీరు మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉందని, మిగిలిన 63 టిఎంసిలను ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టు, 30 లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉందని తెలిపారు. కాలువ ప్రస్తుత పరిస్థితిలో పూర్తి సామర్థ్యంతో నీటిని తరలించడం కష్టమని, స్వీపేజ్, ఆవిరీభవనం తదితర కారణాలతో మరింత నీరు తగ్గే అవకాశం ఉందన్నారు. విశాఖ పరిసరాల్లో ప్రతిపాదించిన 6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు భారీగా నీరు అవసరమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చెబుతున్న 3.5 టిఎంసిల లెక్క వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేదని, నిపుణుల అంచనాల ప్రకారం గిగావాట్‌కు సుమారు ఒక టిఎంసి చొప్పున 6.5 టిఎంసిలవరకు నీరు అవసరమయ్యే అవకాశం ఉందన్నారు. మరోవైపు విశాఖ ప్రజల తాగునీటి అవసరాలు ప్రస్తుతం సుమారు ఏడు టిఎంసిలుగా ఉండగా 2040 నాటికి మరింత పెరుగుతాయని తెలిపారు. పరిశ్రమలకు ఇప్పటికే 70 ఎంజిడిల నీరు సరఫరా అవుతోందని, మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు అదనంగా రెండు టిఎంసిల నీరు అవసరమని తెలిపారు. విశాఖ తాగునీటి సమస్య పరిష్కారానికి కొత్త సమ్మర్ స్టోరేజ్ రిజర్వాయర్లు నిర్మించాలని, ప్రస్తుతం ఉన్న రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యాన్ని పెంచి వాటిని గోదావరి నీటితో నింపాలని జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ఏలేరు కాలువ నుంచి మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు నీరు తరలించే చర్యలను ఉపసంహరించుకోవాలని కోరారు. విశాఖ ప్రజల తాగునీటి అవసరాలకు ఇబ్బంది కలిగించే విధంగా డేటా సెంటర్లకు నీటి కేటాయింపులు చేయొద్దన్నారు.








కామెంట్‌లు (0)