- సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పకుండా అమలు చేయాలి
- ఎస్‌ఇసి అనిల్ చంద్ర పునేఠా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ అందిన వెంటనే ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాల నేపథ్యంలో వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి, అనంతపురం, ప్రకాశం, పల్నాడు, మార్కాపురం జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయవాది అందించిన సమాచారం మేరకు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ ఇంకా అందాల్సి ఉందని కమిషనర్ తెలిపారు. ఉత్తర్వులు అందిన తర్వాత, జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిల నుంచి వచ్చిన నివేదికలను పరిశీలించి రాష్ట్ర ఎన్నికల సంఘం తగిన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏడు జిల్లాల్లోని 19 మున్సిపల్ లకు మినహా మిగిలిన అన్ని మున్సిపల్, కార్పొరేషన్లలో ఎన్నికల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలు ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్ పిలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. నామినేషన్లు సమర్పించే సమయంలో అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలని పోలీసు శాఖకు సూచించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా జరిగేలా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు తగిన బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించారు. నామినేషన్ దాఖలు సమయంలో ఎన్‌ఒసి, నో డ్యూ సర్టిఫికెట్లు తప్పనిసరిగా సమర్పించాలనే నిబంధన ఎన్నికల నియమావళిలో లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అదనపు నిబంధనలు విధించకుండా, అర్హులైన అభ్యర్థులు నిబంధనల ప్రకారం నామినేషన్లు దాఖలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎ మల్లికార్జున, ఎడిజిపి ఎస్ మధుసూధనరెడ్డి, ఐజి బి రాజకుమారి, సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)