- ఎస్‌ఐఆర్ ‘పకడ్బందీ’ ఏర్పాట్లపై ప్రశ్నలు
- 25.43 లక్షల నోటీసులు ఇంకా ఓటర్లకు చేరలేదు
- జనరేట్ చేయాల్సిన నోటీసులు 13వేలే
- ‘బుక్ ఎ కాల్ విత్ బిఎల్‌ఒ కు మంచి స్పందన
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో నోటీసుల జనరేషన్ దాదాపు పూర్తయినా.. వాటిని ఓటర్లకు చేర్చడంలో మాత్రం రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం వెనుకబడుతోంది. అధికారులు వెల్లడించిన ఈనెల 15 నాటి గణాంకాలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.రాష్ట్రంలో మొత్తం 44,21,762 నోటీసులు జారీ చేయాల్సి ఉండగా 44,08,140 నోటీసులు (99.69 శాతం) జనరేట్ అయ్యాయి. అయితే జనరేట్ అయిన నోటీసుల్లో ఇప్పటివరకు కేవలం 18,64,843 మాత్రమే ఓటర్లకు చేరాయి. ఇంకా 25,43,297 నోటీసులు.. అంటే 57.70 శాతం పంపిణీ కావాల్సి ఉంది.
ఒకే రోజులో 4,44,843 నోటీసులు పంపిణీ చేయడం కొంత పురోగతిని చూపుతున్నా, మొత్తం పెండింగ్ సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. నోటీసులు జనరేట్ చేయడంతోనే ప్రక్రియ పూర్తయినట్లు కాకుండా.. సంబంధిత ఓటరుకు నోటీసు చేరడం, తన అభ్యంతరాలు , వివరాలను తెలియజేసుకునే అవకాశం కల్పించడమే ఎస్‌ఐఆర్ ప్రక్రియలో కీలకమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో నోటీసులు పంపిణీ కాకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నాలుగు జిల్లాల్లో 80 శాతానికి పైగా పెండింగ్
కొన్ని జిల్లాల్లో నోటీసుల పంపిణీ పరిస్థితి మరింత వెనుకబడ్డాయి. మార్కాపురం జిల్లాలో 1,58,839 నోటీసులు పెండింగ్‌లో ఉండగా.. మొత్తం నోటీసుల్లో 93.86 శాతం ఇంకా ఓటర్లకు చేరలేదు. విశాఖపట్నంలో 2,02,961 (88.48 శాతం), శ్రీ సత్యసాయి జిల్లాలో 2,34,813 (85.65 శాతం), బాపట్లలో 1,30,887 (82.57 శాతం) నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఏలూరులో మెరుగైన పనితీరు
మరోవైపు కొన్ని జిల్లాలు నోటీసుల పంపిణీలో మెరుగైన పనితీరు కనబరిచాయి. ఏలూరులో 3.46 శాతం, అనకాపల్లిలో 5.05 శాతం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 10.91 శాతం, పోలవరంలో 13.49 శాతం మాత్రమే నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన జిల్లాలు కూడా ఇదే వేగంతో పంపిణీ చేపట్టాల్సిన అవసరం ఉంది.
ఒక్కరోజులో గుంటూరు ముందంజ
గత ఒక్కరోజులో నోటీసుల పంపిణీలో గుంటూరు జిల్లా అత్యధికంగా 35,845 నోటీసులతో ముందంజలో నిలిచింది. విజయనగరంలో 33,581, ప్రకాశం జిల్లాలో 33,331 నోటీసులు పంపిణీ చేశారు. పెండింగ్ నోటీసులను తగ్గించడంలో కొన్ని జిల్లాలు వేగం పెంచుతుండగా, అధిక పెండింగ్ ఉన్న జిల్లాల్లో మాత్రం మరింత చురుగ్గా చర్యలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.
వెంటనే పంపిణీ చేయాలని ఆదేశాలు
నోటీసుల పంపిణీలో జాప్యంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం దృష్టి సారించింది. మిగిలిన నోటీసులను త్వరితగతిన పంపిణీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది.బిఎల్‌ఒలు ఇంటింటికీ వెళ్లి నోటీసులు అందజేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది.ఎస్‌ఐఆర్ ప్రక్రియలో నోటీసుల జనరేషన్ 99.69 శాతం పూర్తయిందని చెబుతున్నప్పటికీ, పంపిణీ సగానికి మించి పెండింగ్‌లో ఉండటం ప్రక్రియ అమలుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ప్రతి అర్హుడైన ఓటరుకు నోటీసు అందించి, తన వివరాలపై అభ్యంతరం లేదా వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించడంలో ఎలాంటి జాప్యం జరగకుండా ఎన్నికల యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
జనరట్ చేయాల్సినవి 13వేలే
ఓటర్ల జాబితా సవరణలో(సర్) భాగంగా వివరాల్లో తేడాలు, లింక్ కాని ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ దాదాపు పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా సుమారు 13 వేల నోటీసులు మాత్రమే జనరేట్ చేయాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం వెల్లడించింది. మిగిలిన నోటీసులను కూడా త్వరితగతిన జనరేట్ చేసి, సంబంధిత ఓటర్లకు అందజేసే ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది.మిగిలిన నోటీసుల్లో అత్యధికంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సుమారు 10 వేలు, వైఎస్సార్ కడప జిల్లాలో సుమారు 2 వేలు ఉన్నాయి. విశాఖపట్నంలో సుమారు 500, శ్రీకాకుళంలో 200, కృష్ణా జిల్లాలో 180, అనంతపురంలో 160 నోటీసులు జనరేట్ చేయాల్సి ఉంది. మిగిలిన జిల్లాల్లో నోటీసుల సంఖ్య స్వల్పంగా ఉందని అధికారులు తెలిపారు.ఓటర్ల జాబితా సవరణలో భాగంగా వివరాల్లో తేడాలు ఉన్న, లింక్ కాని ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ దాదాపు పూర్తయిందది. ఈనెల 15 నాటికి రాష్ట్రంలో 44,21,762 నోటీసులు జనరేట్ చేయాల్సి ఉండగా, 44,08,140 నోటీసులు (99.69 శాతం) జనరేట్ చేసినట్లు శనివారం వెల్లడించారు. ఇంకా 13,622 నోటీసులు మాత్రమే జనరేట్ చేయాల్సి ఉందన్నారు.ఒకే రోజులో 41,312 నోటీసులు జనరేట్ చేసినట్లు ఎన్నికల యంత్రాంగం తెలిపింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్‌టిఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, పోలవరం, మార్కాపురం జిల్లాల్లో నోటీసుల జనరేషన్ వంద శాతం పూర్తయిందని పేర్కొన్నారు. మిగిలిన నోటీసులను కూడా త్వరితగతిన జనరేట్ చేయాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
‘బుక్ ఎ కాల్ విత్ బీఎల్‌ఓ’కు మంచి స్పందన
ఓటర్లు తమ బూత్ లెవల్ అధికారులతో నేరుగా మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకునేందుకు అందుబాటులోకి తెచ్చిన ‘బుక్ ఎ కాల్ విత్ బీఎల్‌ఓ’ సేవకు మంచి స్పందన లభిస్తోందని ధిల్లీరావు తెలిపారు. ఈనెల 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 98,032 మంది ఈ సేవ కోసం దరఖాస్తు చేసుకోగా, 94,836 దరఖాస్తులను బిఎల్‌ఓలు పరిష్కరించారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 546 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి.
వైఎస్సార్ జిల్లాలో అత్యధికంగా 51 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాల్లో 38 చొప్పున, అన్నమయ్యలో 36 పెండింగ్‌లో ఉన్నాయి.అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక్క దరఖాస్తుపెండింగ్‌లో లేదు. గత ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ దరఖాస్తులు 36 తగ్గినట్లు అధికారులు వెల్లడించారు.








కామెంట్‌లు (0)